
నిన్న ఎన్టీఆర్ జయంతి. 99వ బర్త్ యానివర్సరీ సందర్భంగా.. టాలీవుడ్ ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఎంతో మంది ట్వీట్లు, రీ-ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లపై మీడియా కవరేజ్ కూడా భారీగానే జరిగింది. కానీ.. అదేరోజున బాలకృష్ణ చేసిన ఘన కార్యాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు!
తండ్రి జయంతి సందర్భంగా బాలకృష్ణ ‘శ్రీరామ దండకం’ అందుకున్నారు. గతంలో ఆయన పలుమార్లు పాటలు పాడిన సంగతి తెలిసిందే. ఆ మధ్య తుఫాను బాధితుల కోసం నిర్వహించిన ఈ వెంట్లో తన సినిమాలోని పాటను పాడారు. ఈ మధ్య ‘శివశంకరీ..’ అంటూ ఎన్టీఆర్ పాత సినిమా పాటను ఆలపించారు. అయితే.. శ్రోతల అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ.. పాడటాన్ని మాత్రం ఆయన మానలేదు.
లేటెస్ట్ గా.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏదైనా ప్రత్యేకంగా చేయాలని భావించారేమో శ్రీరామ దండకాన్ని పాడి వినిపించారు. వెనుక బాలకృష్ణ గొంతెత్తగా.. స్క్రీన్ పై ఎన్టీఆర్ చిత్రాలు, వీడియోలు ప్లే అయ్యాయి. అయితే.. బాలయ్య చేసిన ఈ ప్రయత్నంపై కనీసం ఓ ట్వీటు కూడా పడలేదు టాలీవుడ్ నుంచి.
బయటి వారి సంగతి పక్కనపెడితే.. కనీసం ఇంట్లోని వారు కూడా స్పందించలేదు. జూనియర్ ఎన్టీఆరో, కల్యాణ్ రామో.. ఎవ్వరూ కితాబిచ్చింది లేదు. కల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘బింబిసారుడు’ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ సమయంలోనూ ఓ మాట కూడా ప్రస్తావించలేదు.
బాలకృష్ణ పాటలకు జనాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలిసిందే. కాబట్టి.. సూపర్ అని చెప్పి ట్రోలింగ్ బారిన పడేకన్నా.. సైలెంట్ గా ఉండడమే మంచిదని భావించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కారణాలు ఏవైనా.. బాలకృష్ణ చేసిన ప్రయత్నాన్ని సొంతవాళ్లు కూడా పట్టించుకోకపోవడం అభిమానులకు కాస్త కష్టంగానే ఉందట.