Yellamma Movie : సినిమాల్లో కమెడియన్ గా మంచి పాపులారిటీ ని తెచ్చుకున్న వేణు, ‘జబర్దస్త్’ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన సంగతి అందరికీ తెలిసిందే. ఇతనిలో కేవలం కామెడీ టైమింగ్ మాత్రమే కాదు, ఒక గొప్ప దర్శకుడు కూడా ఉన్నాడని ‘బలగం’ చిత్రం ద్వారానే తెలిసింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, కేవలం 50 లక్షల రూపాయిల బిజినెస్ తో మొదలైన ఈ చిత్రం ఏకంగా 15 కోట్ల రూపాయిల థియేట్రికల్ షేర్ వసూళ్లను రాబట్టింది. తెలంగాణ సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టు చూపించి శభాష్ అనిపించుకున్నాడు వేణు. అయితే ఈ చిత్రం తర్వాత ఆయన ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేయబోతున్నట్టు అనేక సందర్భాలలో తెలిపాడు. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తాడని అప్పట్లో టాక్ వినిపించేది.
‘సరిపోదా శనివారం’ చిత్ర ప్రొమోషన్స్ లో వేణు తో సినిమా ప్రారంబిస్తున్నారట నిజమేనా అని అడిగిన యాంకర్ కి నాని సమాధానం చెప్తూ ‘వేణు స్టోరీ లైన్ చెప్పాడు, నచ్చింది, కానీ ప్రాజెక్ట్ ఇంకా ఖరారు కాలేదు’ అని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన ఈ కథని రిజెక్ట్ చేసినట్టు లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించిన టాక్. ఆ తర్వాత ఈ వేణు ‘హనుమాన్’ హీరో తేజా సజ్జ వద్దకు వెళ్లి కథని వినిపించాడట. ‘ఆమ్మో..ఈ పాత్ర నా వయస్సుకి మించింది..నేను న్యాయం చేయలేను’ అని చెప్పి ఆయన కూడా ఈ కథని రిజెక్ట్ చేసాడు. మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఈ కథని చేసే సాహసం చేయలేదు. అయితే వీళ్లందరికంటే ముందే ఈ కథని వేణు నితిన్ కి వినిపించాడట. అయితే అప్పటికే దిల్ రాజు బ్యానర్ లో రెండు సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడు నితిన్. ఇప్పుడు మళ్ళీ ఆయన నిర్మాణంలోనే నటిస్తే బాగుండదు అని ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడట. అయితే దిల్ రాజు నితిన్ తో మాట్లాడి ఒప్పించడంతో నితిన్ ఇందులో హీరో గా నటించేందుకు ఒప్పుకున్నాడు.
‘కాంతారా’ చిత్రం ఎలా అయితే కర్ణాటక తాండాలలోని సంస్కృతిని ఆధారంగా చేసుకొని తెరకెక్కించారో, ‘ఎల్లమ్మ’ చిత్రం కూడా ‘తెలంగాణ’ కాంతారా గా ఉండబోతుందట. అయితే కేవలం ఒక్క ప్రాంతం సంస్కృతి ని ఆధారంగా చేసుకొని సినిమా తీస్తే కేవలం ఆ ప్రాంతంలో మాత్రమే భారీగా ఆడుతుంది, మిగిలిన ప్రాంతాలలో పెద్దగా ఆడడు అనే భయం యంగ్ హీరోలలో ఉంది. ‘బలగం’ చిత్రం అలాగే ఆడింది, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో అంతంత మాత్రంగానే వచ్చింది. నాని ఈ కథని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఇదే అని అంటున్నారు. ఆయన నటించిన ‘దసరా’ చిత్రం తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కింది. తెలంగాణలో భారీ వసూళ్లను సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ లో అంతంత మాత్రం గానే వసూళ్లు వచ్చాయి. కొన్ని ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు, అందుకే నాని మళ్ళీ ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయదల్చుకోలేదని తెలుస్తుంది.