Amardeep : బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 ప్రారంభం అయినప్పటీ నుంచి ముగిసేంత వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సీజన్ లో కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ విన్నర్ గా నిలువగా.. సీరియల్ యాక్టర్ అమర్ దీప్ రన్నర్ గా నిలిచారు.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్ దీప్ పై కొందరు ఆకతాయిలు దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అమర్ కుటుంబంతో పాటు ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కార్లపై కూడా అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయి. అయితే స్వల్ప గాయాలతో బయటపడిన అమర్ దీప్ ఆ తరువాత ఫ్యాన్స్ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 లో కప్పు సాధించలేకపోయినా ప్రేక్షకుల హృదయాలను గెలిచినట్లు అమర్ దీప్ చెప్పారు. ఈ జన్మకి ఇంతకంటే ఏం కావాలని భావోద్వేగానికి లోనయ్యారు. దాడిపై స్పందించిన ఆయన తనకేం కాదని చెప్పారు. తనకు అభిమానుల అండ ఉందన్న అమర్ దీప్ తాను నిజంగా ఇంతవరకూ వస్తానని అనుకోలేదని చెప్పారు. మాస్ మహారాజా రవితేజ తన ఇన్స్పిరేషన్ అని తెలిపారు. సూటిగా మాట్లాడటమే తనకు తెలుసని, ఏదైనా అలానే మాట్లాడతానన్నారు. ఇప్పటివరకు అలానే ఉన్నానని, అలానే మాట్లాడానని పేర్కొన్నారు. కప్పు గెలవలేదని ఫీల్ కావడం లేదన్నారు. కప్పు లేకపోయినా అందరి మనసులను గెలిచానని తనకు అది చాలని స్పష్టం చేశారు.
సాధారణంగా మాస్ ఫాలోయింగ్ అంత ఈజీగా ఎవరికీ రాదని అమర్ దీప్ తెలిపారు. వస్తే వాడు మగాడ్రా అన్న ఆయన మీసం మెలేస్తున్నా అని చెప్పారు. అలాగే తనను సపోర్ట్ చేసి విజయానికి కారణమైన ఆడపడుచులందరికీ చేతులేత్తి మొక్కుతున్నట్లు తెలిపారు. తరువాత అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగానే తన అభిమాన హీరో రవితేజ మాస్ బీట్ సాంగ్స్ కు అభిమానులతో కలిసి డ్యాన్స్ చేశారు.