Nara Lokesh: 226 రోజుల్లో 3,132 కిలోమీటర్లు నడిచిన లోకేష్..

తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పాదయాత్రలు చేశారు. ప్రజా దీవెనలు అందుకున్నారు. అధికారంలోకి రాగలిగారు. 1994లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ కాక వికలమైంది. 1999లో రెండోసారి ఓటమి ఎదురు కావడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది.

Written By: Dharma, Updated On : December 18, 2023 1:38 pm
Follow us on

Nara Lokesh: నారా లోకేష్ యువ గళం పాదయాత్ర నేటితో ముగియనుంది. 226 రోజుల్లో 3,132 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. జనవరి 27న కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 11 ఉమ్మడి జిల్లాల్లో.. 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు.2,029 గ్రామాల మీదుగా యాత్ర సాగింది. 70 బహిరంగ సభలు, 154 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని లోకేష్ సమస్యలను తెలుసుకున్నారు. గ్రేటర్ విశాఖ శివాజీ నగర్ లో లోకేష్ పాదయాత్ర సోమవారం ముగియనుంది.విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి లో పాదయాత్ర విజయోత్సవ సభ నిర్వహించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పాదయాత్రలు చేశారు. ప్రజా దీవెనలు అందుకున్నారు. అధికారంలోకి రాగలిగారు. 1994లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ కాక వికలమైంది. 1999లో రెండోసారి ఓటమి ఎదురు కావడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. చంద్రబాబు ఎత్తుగడలకు పార్టీ ఉనికి లేకుండా పోయింది. అటువంటి సమయంలోనే నేనున్నాను అంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి చేశారు. 2004లో పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు.

2013లో చంద్రబాబు పాదయాత్ర చేశారు. కుప్పం నుంచి విశాఖ వరకు పాదయాత్ర చేపట్టారు. దాదాపు 67 సంవత్సరాల వయసులో పాదయాత్రకు దిగడం విశేషం. ఆ ఎన్నికల్లో చంద్రబాబు గెలుపొందారు. అటు తరువాత జగన్ 2018లో పాదయాత్ర చేశారు. అటు సిపిఐ కేసుల విచారణకు వారం వారం హాజరవుతూనే.. పాదయాత్రను పూర్తి చేశారు. కడప జిల్లా ఏడుపాలపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు యాత్ర కొనసాగింది. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాగలిగారు.

ఇప్పుడు లోకేష్ సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. అయితే ప్రారంభం నుంచే కొద్దిపాటి అవరోధాలను ఎదుర్కొన్నారు. తొలి రోజే తారకరత్నకు గుండెపోటు రావడంతో పాదయాత్ర పై ప్రభావం చూపింది. ఆయన అకాల మరణంతో ఒక్కరోజు పాటు పాదయాత్ర నిలిచిపోయింది. మధ్యలో రెండు రోజులు పాటు కోర్టుకు హాజరు కావడంతో బ్రేక్ పడింది. సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టు తర్వాత సుదీర్ఘకాలం పాటు నిలిచిపోయింది. కొద్ది రోజుల కిందట రాజోలు నియోజకవర్గం లో ప్రారంభమైన పాదయాత్ర.. తూర్పుగోదావరిజిల్లా మీదుగా.. విశాఖలో ప్రవేశించింది. గ్రేటర్ విశాఖలో నేడు ముగియనుంది. లోకేష్ పాదయాత్రతో టిడిపికి పూర్వవైభవం ఖాయమని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.