Allu Arjun : మహిళ మృతికి పరోక్షంగా అల్లు అర్జున్ కారణం అయ్యాడంటూ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా… హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ అల్లు అర్జున్ ఒకరోజు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. సాధారణ ఖైదీలా అల్లు అర్జున్ నేలపై పడుకున్నాడట. ఆయన ఆహారం కూడా తినలేదని సమాచారం. ఆ మరుసటి రోజు ఉదయం అల్లు అర్జున్ విడుదలయ్యారు.
మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్.. తనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని అన్నారు. తన కుటుంబ సభ్యులకు ఇది కఠిన సమయం. నేను బాగానే ఉన్నాను. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అని చెప్పారు. రేవతి మృతి దురదృష్టకరం. గతంలో చాలా సినిమాలు థియేటర్స్ లో అభిమానుల మధ్య చూశాను. ఇలాంటి విషాదం చోటు చేసుకోలేదు అన్నారు.
జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్ ని కలిసేందుకు పరిశ్రమ మొత్తం కదిలి వచ్చింది. సీనియర్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తున్నారన్న న్యూస్ కాకరేపుతుంది. హైదరాబాద్ కి బయలుదేరిన పవన్ కళ్యాణ్ నేడు అల్లు అర్జున్ తో భేటీ అవుతున్నాడు అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతుంది.
అయితే సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ కూటమి పార్టీ ప్రధాన ప్రత్యర్థి వైసీపీకి పరోక్షంగా మద్దతు తెలిపినట్లు అయ్యింది. నంద్యాల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి అల్లు అర్జున్ కి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ నేరుగా వెళ్లడం జనసేనతో పాటు కూటమి నేతల్లో అసంతృప్తి రాజేసింది. నాగబాబు పరోక్షంగా అల్లు అర్జున్ పై సోషల్ మీడియా వేదికగా తన అసహనం వెల్లడించారు. ఇక పుష్ప మూవీపై పవన్ కళ్యాణ్ పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు-మెగా కుటుంబాల మధ్య దూరం పెరిగిందంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ కలుస్తున్నారన్న న్యూస్ ప్రాధాన్యత సంతరించుకుంది.