
అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుమంత్. కొన్నేళ్ల క్రితమే ‘తొలి ప్రేమ’ ఫేమ్ కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. కానీ.. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే.. ఇన్నాళ్లకు మళ్లీ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. మరి, సుమంత్ పెళ్లి విశేషాలు ఏంటన్నది చూద్దాం.
కీర్తి రెడ్డితో విడిపోయిన తర్వాత చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నాడు సుమంత్. అయితే.. కీర్తి రెడ్డి మాత్రం ఎప్పుడో రెండో పెళ్లి చేసుకుంది. అక్కినేని నాగేశ్వరరావు కూడా పలుమార్లు రెండో పెళ్లి చేసుకోవాలని సుమంత్ కు సూచించారు. కానీ.. సుమంత్ అలాగే ఉండిపోయాడు. ఇన్నాళ్లకు ఆ ముహూర్తం వచ్చింది. రెండో పెళ్లి చేసుకోవడానికి ఈ హీరో రెడీ అయ్యాడు.
సుమంత్ పెళ్లి చేసుకోబోతున్న ఆమె పేరు పవిత్ర. వీళ్లిద్దరూ స్నేహితులు. కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే.. పెళ్లి వేడుక మాత్రం ఆడంబరంగా జరపకూడదని నిర్ణయించుకున్నాడు. కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల మధ్యనే జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు.
పవిత్ర ప్రస్తుతం లాయర్ గా పనిచేస్తున్నారు. వీళ్లిద్దరి స్నేహం నిన్నామొన్న మొదలైంది కాదు. బాల్య స్నేహితులు. ఇద్దరూ కలిసి హైదరాబాద్ పబ్లిక్ సక్కూల్లో చదువుకున్నారు. పెళ్లికి కార్డులు కూడా ప్రింట్ చేయించినప్పటికీ.. కొద్దిమంది బంధు మిత్రులకు మాత్రమే అందించారు. అయితే.. ఈ వెడ్డింగ్ కార్డులో పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. మరి, అధికారికంగా వెల్లడిస్తారేమో చూడాలి.