ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఇబ్బందుల్లో ఆర్థిక లోటు ఒకటి. రాష్ట్రం ఏర్పడిందే.. లోటు బడ్జెట్ తో! విభజన చట్టం ప్రకారం.. ఏపీకి అందించాల్సిన సహకారం కేంద్రం అందించలేదు. లోటు బడ్జెట్ సైతం పూడ్చలేదు. ఇవాళ ఆ రాష్ట్రం ఉద్యోగుల జీతాలకు సైతం అవస్థలు పడుతోంది. అప్పులతోనే కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి. ఇందులో రాష్ట్ర సర్కారు బాధ్యత ఎంత అనేది ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. మరి, కేంద్రం కూడా బాధ్యత గుర్తెరగాలి కదా.. అన్నది ప్రశ్న.
ఈ ఏడాదిలో ఇప్పటికే 4 వేల కోట్లకుపైగా ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసిందని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో ఏపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు తెలిపింది. అంతేకాదు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 54,369.18 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్టు రాష్ట్రమే బడ్జెట్లో ప్రకటించిందని కూడా గుర్తు చేసింది. నిజానికి ఏపీ సర్కారు చేస్తున్న అప్పులపై విమర్శలు చాలా ఉన్నాయి. అందినకాడల్లా అప్పులు చేస్తూ.. బండి లాగిస్తున్నారని, ఇది భవిష్యత్ లో రాష్ట్రాన్ని దివాలా అంచుకు నెట్టేస్తుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం.. ఏ రాష్ట్రం కూడా అనుమతి ఉన్న మేరకే అప్పులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. ఆ చట్టాన్ని అతిక్రమించి కూడా అప్పులు చేస్తున్నప్పుడు మరి, కేంద్రం ఏం చేస్తున్నట్టు? అన్నది ప్రశ్న. మితిమీరిన అప్పులు చేసేంత వరకు చూసి.. ఆ తర్వాత అధికంగా అప్పు చేశారని అనడం ద్వారా ఉపయోగం ఏముంది? ముందుగానే స్పందించి, పరిమితికి మించి అప్పు చేయకుండా కట్టడి చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదుకదా.. అనే ప్రశ్న ఎదురవుతోంది. కేవలం రాజకీయ కారణాలతో చూసీ చూడనట్టుగా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికారికంగా.. బడ్జెట్లోనే రూ.50 వేల కోట్ల అప్పులు ఉంటే.. లెక్కలోకి రాని అప్పులు, ఇతర వ్యయాలు కలిపితే ఈ మొత్తం ఇంకా ఎక్కువే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బహుశా.. దేశంలో ఇంత దీన స్థితిలో ఏపీ మాత్రమే ఉందని అంటున్నారు. ఉద్యోగుల జీతాలకు కూడా ఇబ్బందులు పడుతూ.. ప్రతీవారం ఆర్బీఐ వద్ద బాండ్ల వేలం ద్వారా అప్పులు తెచ్చుకుంటూ బండి నెట్టుకొస్తున్న ఏపీ.. రేపు దివాళా తీసి, రాష్ట్రం అస్తవ్యస్తమైపోతే.. దీనికి కేంద్రం కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని మేధావులు అంటున్నారు.