
ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార వైసీపీపై విరుచుకుపడ్డారు. అప్పుడు బ్రిటిష్ వారు గోమాతను చులకన చేస్తే, ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కుని చేస్తున్నారని విమర్శించారు. భారతీయులు పవిత్రంగా భావించే గోమాతపై వైసీపీ నాయకుల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. గోవులపై, గోరక్షణ చట్టంపై వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తాజాగా బీజేపీ ధర్నా కార్యక్రమం నిర్వహించింది.
సీఎం ఓటు బ్యాంకు రాజకియ్యలు చేస్తున్నారని సోము వీర్రాజు విమర్శించారు. వైసీపీ ప్రజావ్యతిరేక పాలనను బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్రంలో వైసీపీని ధీటుగా ఎదుర్కొనే పార్టీ బీజేపీ అన్నారు. ఎస్టీలపై దాడులు చేసి మతం మారాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు.
హిందువుల మనోభావాలకు అద్దం పట్టే పార్టీ బీజేపీ అని సోము వీర్రాజు అన్నారు. వైసీపీ నేతలు గోమాత పై చేసిన అనుచిత వ్యాఖ్యలు,ఎస్టీలపై దాడులపై ఈ ప్రభుత్యం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజాఉద్యమం తప్పదని హెచ్చరించారు.
వైసీపీ నవరత్నాలు ఇస్తే,బీజేపీ 100 రత్నాలు ఇస్తుందని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. నవరత్నాలు కోసం అప్పు చేసి పప్పు కూడు పెడుతుంది వైసీపీ పార్టీ అని.. ఆంధ్రప్రదేశ్ ను అప్పులతో దివాళా తీయిస్తోందని సోము విమర్శల వర్షం కురిపించారు.