Venu Thottempudi: సినీ ఇండస్ట్రీ లో తనదైన నటనతో, కామెడీ టైమింగ్ ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్న హీరో వేణు తొట్టెంపూడి. ‘స్వయంవరం’ అనే బ్లాక్ బస్టర్ చిత్రంతో హీరోగా వెండితెర అరంగేట్రం చేసిన వేణు, ఆ తర్వాత చిరు నవ్వుతో, చెప్పవే చిరుగాలి, పెళ్ళాం ఊరెళ్ళితే, హనుమాన్ జంక్షన్, యమగోల మళ్ళీ మొదలైంది, గోపి గోపిక గోదావరి ఇలా ఒక్కటా రెండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికీ ఆయన సినిమాలకు టీవీ టెలికాస్ట్ సమయంలో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుంటాయి. అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోలలో ఒకరైన వేణు తొట్టెంపూడి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు కొంతకాలం దూరమయ్యాడు. వ్యాపార రంగంలో ఫుల్ బిజీ అయ్యాడు. అయితే ఇప్పుడు ఆయనపై పోలీస్ కేసు నమోదు అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే వేణు చాలా కాలం నుండి మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ‘ప్రోగ్రెసివ్ కనెక్షన్స్’ అనే సంస్థ లో ప్రతినిధిగా పని చేస్తున్నాడు. ఈ సంస్థ ద్వారా ఆయన ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మక కాంట్రాక్ట్స్ ని తీసుకొచ్చాడు. గత కొంతకాలం క్రితమే ఆయన ఉత్తరాఖండ్ లోని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక కాంట్రాక్టు ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ‘ప్రోగ్రెసివ్ కనెక్షన్స్’ సంస్థ తో THDC సంస్థ కొన్ని అంశాలపై తమ అసంతృప్తి వ్యక్తం చేసింది. అలా వాళ్ళ మధ్య విబేధాలు తలెత్తడంతో ఆ సంస్థ ఎండీ రవికృష్ణ వేణు, మరియు అతనితో పాటు పని చేసే నలుగురిపై పోలీస్ స్టేషన్ లో కేసు ఫిర్యాదు నమోదు చేశాడు. ఈమేరకు వేణు తొట్టెంపూడి పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎలాంటి వివాదాలు లేకుండా చాలా కూల్ గా సాగిపోయే వేణు తొట్టెంపూడి పై పోలీస్ కేసు నమోదు అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ కేసు నుండి ఆయన బయటపడాలని కోరుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా చాలా కాలం నుండి సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చిన వేణు తొట్టెంపూడి ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చాడు. రవితేజ హీరో గా నటించిన ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ చేశాడు. ఈ చిత్రం తర్వాత ఆయన హాట్ స్టార్ లో ‘అతిధి’ అనే వెబ్ సిరీస్ కూడా చేశాడు. మంచి క్యారెక్టర్స్ దొరికితే మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్దమే అంటూ పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చిన వేణు తొట్టెంపూడి ప్రస్తుతం మరో వెబ్ సిరీస్ లో హీరో గా నటిస్తున్నాడు. చూడాలి మరి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది అనేది.