TG Congress: మొన్నామధ్య కాంగ్రెస్ పార్టీ ఒక పోల్ పెట్టింది. తన ట్విట్టర్ ఖాతాలో ఈ పని చేసింది. కానీ ఆ పార్టీ అనుకున్న దానికంటే వ్యతిరేక ఫలితం వచ్చింది. ప్రజా పాలన కంటే ఫామ్హౌస్ పరిపాలనే బాగుందని మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఇందులో సహేతుకత ఎంత ఉంది? ఇందులో ఎవరు పాల్గొన్నారు? అనే విషయాలను కాస్త పక్కన పెడితే.. ఈ పోల్ ను భారత రాష్ట్ర సమితి అత్యంత తెలివిగా హైజాక్ చేసింది. దేశ విదేశాలను బాట్ లతో కొట్టి పడేసింది.. ఇక్కడే భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా బలాన్ని అంచనా వేయడంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విఫలమైంది. ఆ తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇదే విషయాన్ని కెసిఆర్ ఇటీవల గజ్వేల్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. నేను కొడితే మామూలుగా ఉండదని కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరికలు పంపారు. అంతేకాదు ట్విట్టర్లో పెట్టిన పోల్ ను ప్రముఖంగా ప్రస్తావించారు. కెసిఆర్ లాంటి నాయకుడికి ఈ పోల్ లో ఉన్న నిజాలు ఎంత? దీనికున్న పారదర్శకత ఎంత? అనే విషయం తెలుసు. సోషల్ మీడియాలో ఇలాంటి పోల్స్ వల్ల జరిగే ప్రయోజనం కూడా ఉండదని తెలుసు. అయినప్పటికీ కూడా సోషల్ మీడియా ప్రభావం తెలుసు కాబట్టి కెసిఆర్ ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. కానీ సోషల్ మీడియా గొప్పతనాన్ని.. దానివల్ల ఉన్న ఉపయోగాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించలేకపోతోంది. అందువల్లే అధికారంలో ఉన్నప్పటికీ తన సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసుకోవడంలో పూర్తిగా విఫలమవుతోంది. చివరికి భారతీయ జనతా పార్టీ కూడా సోషల్ మీడియాలో అత్యంత బలంగా ఉంది. యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్లు ఇతరత్రా వాటితో భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నది. జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలకు ఇందులో ప్రాధాన్యమిస్తుంది. ఇక భారత రాష్ట్ర సమితి కూడా తనకు అనుకూలంగా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ను మలచుకుంది..వెబ్ సైట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ట్విట్టర్ హ్యాండిల్స్ అయితే కొన్ని వందల ఖాతాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా భారత రాష్ట్ర సమితి చాలా తెలివిగా నిర్వహిస్తున్నది. సోషల్ మీడియాలో ఎంత గాలి పోగేయాలో.. అంతలా చేస్తోంది.
ఇటీవల నిర్వహించిన పోల్ వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరిగింది. అయినప్పటికీ ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించడం లేదు. పైగా ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఉంటుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా చైర్మన్ ను మార్చుతారని.. మరో కొత్త వ్యక్తిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ గనుక ఇదే జరిగితే భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా ముందు ఓడిపోయినట్టు కాంగ్రెస్ ఒప్పుకోవాల్సి ఉంటుంది.. దీనిని భారత రాష్ట్ర సమితి మరింత బలంగా ప్రచారం చేసుకుంటుంది.. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తల వంపులకు గురికావాల్సి ఉంటుంది. మరోవైపు సోషల్ మీడియా చైర్మెన్ పోస్ట్ కోసం ఇద్దరు ముగ్గురు నాయకుల మధ్య తీవ్ర పోటీ ఉందని తెలుస్తోంది. వారంతా కూడా ఎవరికివారు బల ప్రదర్శన చేస్తున్నట్టు సమాచారం.. ఒక నాయకుడు అయితే నేరుగా ఓ కేబినెట్ ర్యాంక్ మంత్రితో దీపా మున్షి ని కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంకొక నాయకుడు అయితే తన గాడ్ ఫాదర్ ద్వారా కేసి వేణుగోపాల్ కు ఫోన్ చేయించినట్టు సమాచారం. ఇలా పదవుల కోసం నాయకులు కొట్లాడుకుంటూ.. ఆయాచిత బలాన్ని అందించే సోషల్ మీడియా విభాగాన్ని పక్కనపెడుతున్నారు. దానిని బలోపేతం చేసుకోకుండా పరువు తీసుకుంటున్నారు. ఇలాగే అయితే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం బలోపేతం కావడం కాదు కదా.. నానాటికి బలహీనమవుతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.