Election Commission: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్.. ఇటీవలే సార్వత్రిక ఎన్నికలను కేంద్ర ఎన్నికల సఘం విజయవంతంగా నిర్వహించింది. అవి పూర్తయిన వెంటనే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల ప్రకటించింది. ఈ ఎన్నికల అనంతరం మళ్లీ దేశంలో ఎన్నికల సందడి మొదలు కానుంది. ఈసారి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది జమ్మూ కశ్మీర్‌తోపాటు హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే నోటిఫికేషన్ వెలువరించనుంది.
ఐదేళ్ల తర్వాత కశ్మీర్‌లో ఎన్నికలు..
జమ్మూ కశ్మీర్‌లో ఆర్టిక్ 370 రద్దు తర్వాత కేంద్రం ఆ రాష్ట్రాన్ని రెండ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. శాసన సభను రద్దు చేసింది. ఐదేళ్లుగా జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. త్వరలోనే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఆగస్టు 20 తర్వాత తుది ఓటర్ల జాబితా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈమేరకు జమ్మూ కశ్మీర్‌తోపాటు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. జూలై 1 వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తారు. జూలై 25న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. తర్వాత అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత వాటిని పరిష్కరించి ఆగస్టు 20 తుది జాబితా ప్రకటిస్తారు.
అసెంబ్లీల గడువు ఇలా..
ఇదిలా ఉంటే నాలుగు రాష్ట్రాల ప్రస్తుత ప్రభుత్వాల గడువు ఇలా ఉంది. హర్యాన అసెంబ్లీ గడువు నవంబర్ 11న ముగుస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26న జార్ఖండ్ అసెంబ్లీ గడువు వచ్చే 2025, జనవరి 5న పూర్తవుతుంది. ఇక జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.