U shape Class Rooms: సినిమా అనేది బలమైన మాధ్యమం. వెనుకటి రోజుల్లో సందేశాల ఇతివృతంగా సినిమాలు వచ్చేవి. చాలామంది సినిమాలను చూసి చాలామంది స్ఫూర్తి పొందేవారు… ఆ సినిమాల ద్వారా తమ జీవితాన్ని కూడా మార్చుకునేవారు. కానీ నేటి కాలంలో సినిమాలు అలా లేదు. కుటుంబంతో కాదు కదా కనీసం ఇద్దరు కూర్చుని చూసే పరిస్థితులు లేదు. ద్వంద్వార్ధాలు.. బూతు సన్నివేశాలు వంటివి పరిపాటిగా మారిపోయాయి. హింసను ప్రధానంగా చూపిస్తున్నారు. హింసను ప్రేరేపించే విధంగా సన్నివేశాలు తీస్తున్నారు. తద్వారా సినిమాలు చూడాలంటేనే భయం కలిగే పరిస్థితులను కల్పిస్తున్నారు.
ఇలాంటి కాలంలో కూడా గంజాయి వనంలో తులసి మొక్కలు ఉన్నట్టు.. అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి. సామాజిక ఇతివృత్తంతో రూపొందుతున్నాయి. అలాంటి సినిమాలు జనాదరణ పొందుతున్నాయి. మలయాళం లో “స్థనార్థి శ్రీ కుట్టన్” అనే పేరుతో ఇటీవల ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో బ్యాక్ బెంచర్లు ఉండకూడదని విద్యార్థులను అర్థ వృత్తాకారంలో కూర్చోబెడతారు.. దానివల్ల అసమానతలు తొలగిపోతాయని.. అందరూ సమానమనే భావన కలుగుతుందని ఆ సినిమాలో చూపించారు. ఇప్పుడు దానిని కేరళలో అమలు చేస్తున్నారు.
కేరళ రాష్ట్రంలోని పాఠశాలలో యూ సీటింగ్ మోడల్ ద్వారా విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. గతంలో ఫస్ట్ బెంచ్, లాస్ట్ బెంచ్ అనే విధానం కేరళ పాఠశాలల్లో ఉండేది. ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న విద్యార్థులు గొప్పవారని.. లాస్ట్ బెంచ్ లో కూర్చున్నవారు అల్లరి వారని ఒక అపోహ ఉండేది. ఈ అపోహ కేరళ రాష్ట్రంలో కూడా ఉంది.
Also Read: కన్నతల్లి కన్నీటి పాఠం – మరచిన మానవత్వం
అది నిజం కాదని.. లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్లు అల్లరి వారు కాదని.. వారిలో కూడా జిజ్ఞాస ఉంటుందని స్థనార్థి శ్రీ కుట్టన్ సినిమా నిరూపించింది. చిన్న సినిమాగా విడుదలై ఇది కేరళ రాష్ట్రంలో సంచలన విజయం నమోదు చేసింది. ముఖ్యంగా విద్యార్థుల ఆదరణను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమాను కొన్ని పాఠశాలలు ప్రత్యేకంగా విద్యార్థుల కోసం చూపించాయి. విద్యార్థులు ఎలా ఉండాలి.. ఉపాధ్యాయులు వారితో ఎలా ప్రవర్తించాలి.. అనే విషయాలను ఈ సినిమాలో ప్రముఖంగా చూపించారు. అందువల్లే ఈ సినిమా ఆ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది.
ఫస్ట్ బెంచర్లతో పోల్చి చూస్తే.. లాస్ట్ బెంచర్లలో ఆత్మ న్యూనత ఎక్కువగా ఉంటుంది. పైగా వారిపై అల్లరి పిల్లలు అనే ముద్ర కూడా ఉంటుంది. అందుకే ఆ పిల్లల్లో ఒక రకమైన వ్యక్తిత్వం ఉంటుంది. వారు ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడరు . ఇతరులతో కలవడానికి ఆసక్తి చూపించరు. కోపంగా ఉంటారు. భావాలను వ్యక్తీకరించకుండా అంతర్ముఖులుగా కనిపిస్తారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని శ్రీకుట్టన్ సినిమా రూపొందింది. చివరికి ఆ సినిమాలో విద్యార్థులను యు సీటింగ్ మోడల్ లో కూర్చోబెడతారు. అందరు పిల్లలు సమానమనే భావన తీసుకొస్తారు. దానివల్ల పిల్లల్లో ఉన్న ఆత్మ న్యూనతా భావం తగ్గిపోతుంది. అందరిలోనూ ఏదో సాధించాలనే కసి పెరుగుతుంది. గొప్పగా చదువుకోవాలని.. ఉన్నతమైన స్థానాలలో స్థిరపడాలని కోరిక కలుగుతుంది.
Also Read: అక్కా నువ్వూ సూపరహే..మేకలతో ఎక్కించేశావు
ఆ సినిమాను పూర్తిగా తీసుకొని కేరళ విద్యాశాఖ అధికారులు ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. యూ సీటింగ్ మోడల్ తెరపైకి తీసుకొచ్చారు. ఇది విద్యార్థుల్లో సరికొత్త మార్పులను తీసుకొస్తుందని కేరళ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో స్నేహభావం పెరిగిపోయిందని.. అందరం ఒకటేననే భావన వారిలో కలుగుతోందని అధికారులు అంటున్నారు.
” గతంలో ఈ విధానం ఉండేది కాదు. ఇటీవల కాలం నుంచి దీనిని అమలు చేస్తున్నాం. దీనివల్ల విద్యార్థులు స్నేహంగా ఉంటున్నారు. మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నారు. భోజనం చేసే సమయంలో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒకరి కూరలు మరొకరు వేసుకుంటున్నారు. ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటున్నారు. రాని విషయాల గురించి చర్చిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా స్నేహభావాన్ని పెంపొందించుకుంటున్నారు. ఇలాంటివే ఈ కాలంలో కావాలి. ఇలాంటివే ఈ కాలంలో నిలబడాలి. ఇలాంటి వాటి వల్లే విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదుగుతారని” కేరళ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.