Engineering Admissions : ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు షెడ్యూల్‌ ఖరారు.. కౌన్సెలింగ్‌ ఎప్పుడంటే..

జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ అవకాశం కల్పించారు. జులై 24లోపు అన్ని సీట్లను కేటాయించి.. జులై 23న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.

Written By: NARESH, Updated On : May 24, 2024 8:24 pm

he schedule for engineering admissions in Telangana

Follow us on

Engineering Admissions : ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో సీట్లను మూడు విడతల్లో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమైన కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే విద్యార్థులు ఎస్సెస్సీ, ఇంటర్‌ మార్కుల మెమోలు, టీసీ, కులం, ఆదాయం సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారం కోసం tgeapcet వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇలా..

= జూన్‌ 27వ తేదీ నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తారు.

= జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం.

= జూలై 12న మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్లు కేటాయిస్తారు.

= జూలై 19న రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది.

= జూలై 24న ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో విడత సీట్లు కేటాయిస్తారు.

= జూలై 30 నుంచి ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్.

= ఆగస్టు 5వ తేదీన తుది విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది.

ఆన్‌లైన్‌లో ఇంటర్నల్ స్లైడింగ్..
ఇంటర్నల్‌ స్లైడింగ్‌ ఈసారి ఆన్‌లైన్‌లో కన్వీనర్‌ ద్వారా చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత స్లైడింగ్‌ నిర్వహిస్తారు.

= ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ.

= ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు.

= ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల.

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదీ..

తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైంది. జూన్ 20 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జూన్ 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్.. జులై 9న వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. వీరికి జులై 13న సీట్లను కేటాయిస్తారు. పాలిసెట్‌లో కూడా ఇంటర్నల్ స్లైడింగ్ కన్వీనర్ ద్వారా చేపట్టాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ అవకాశం కల్పించారు. జులై 24లోపు అన్ని సీట్లను కేటాయించి.. జులై 23న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.