Group 1 Hall Tickets: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్((TSPSC) నిర్వహించే గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9న జరుగనుంది. ఈమేరకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ, బయెమెట్రిక్ తీసుకోవడంలో నిర్లక్ష్యం కారణంగా రెండుసార్లు పరీక్ష రద్దయింది. ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా టీఎస్‌పీఎస్సీ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఓఎంఆర్ పద్ధతిలో ప్రిలిమ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏర్పాట్లు చేసింది.
హాల్‌టికెట్లు విడుదల..
పరీక్షకు ఇంకా 9 రోజులే ఉన్న నేపథ్యంలో పరీక్ష రాయనున్న అభ్యర్థుల హాల్ టికెట్లను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జూన్1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు https:/www.tspsc.gov.in/ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
నిబంధనలు విడుదల..
ఇదిలా ఉండగా గ్రూప్–1 ప్రలిమ్స్‌కు సంబంధించిన నిబంధనలు, రూల్స్, తీసుకురావాల్సిన ధ్రువపత్రాల గురించి టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. ఓఎంఆర్ పరీక్ష ఎలా ఉంటుంది. ఎలా రాయాలి అనే వివరాలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఓఎంఆర్ షీట్‌లో తప్పులు ఉంటే ఏం చేయాలన్న వివరాలు కూడా వెల్లడిచింది. ఇక పరీక్ష కేంద్రంలోకి ఉదయం 9 గంటలకే అనుమతిస్తామని తెలిపింది. 10 గంటలకే కేంద్రాల గేట్ క్లోస్ చేస్తామని, 10:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని వెల్లడించింది. మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది.
పరీక్షకు 4.03 లక్షల మంది..
563 పోస్టుల భర్తీకి విడుదల చేసిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ పడుతున్నారు. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. ఒకేపేపర్ ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు, 150 మార్కులకు ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఇక మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షకు 900 మార్కులు ఉంటాయి.