AP Schools: ఏపీలో పాఠశాల విద్యాశాఖ ( School Education Department)సమూల ప్రక్షాళనలకు దిగింది. విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. బడుల నిర్వహణ, ఉపాధ్యాయుల సర్దుబాటుపై కార్యాచరణ సిద్ధం చేసింది. ఉపాధ్యాయ సంఘాలతో చర్చల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని భావిస్తోంది. జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆరోజు విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక విద్యా క్యాలెండర్ను ప్రభుత్వం ప్రకటించింది. పని దినాలతో పాటు సెలవులను వెల్లడించింది. మరోవైపు ప్రతి శనివారం నో బ్యాక్ డే ను అమలు చేయనుంది.
* క్యాలెండర్ విడుదల..
సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు వార్షిక క్యాలెండర్( academic calendar ) ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో 263 రోజులు పని దినాలుగా పేర్కొంది. ఒకటి నుంచి ఐదు తరగతులకు ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నట్లు తెలిపింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు ఈ విద్యా సంవత్సరంలో దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ రెండు వరకు కొనసాగనున్నాయి. సంక్రాంతి సెలవులు జనవరి పది నుంచి 18 వరకు ఖరారు చేశారు. మైనారిటీ విద్యాసంస్థలకు దసరా సెలవులు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 21 నుంచి 28 వరకు ప్రకటించారు. సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 15 వరకు ఉంటాయి.
* ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు..
అయితే విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలతో( teachers unions ) పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ చర్చలు జరిపారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరపున చర్చలు ఫలించినట్లు ప్రకటించారు. ఎస్ జి టి లకు మ్యాన్యువల్ పద్ధతిలో బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమ్మతించింది. ఉన్నత పాఠశాలల్లో 49 దాటిన తర్వాత రెండవ సెక్షన్ ఏర్పాటు చేసేందుకు సర్కార్ అంగీకరించింది. ఫౌండేషన్ పాఠశాలల్లో 20 రోల్ దాటిన తరువాత రెండో పోస్ట్ కేటాయించనున్నారు. ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే ప్రాథమిక పాఠశాలలను విడిగా నిర్వహిస్తామని కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గించేందుకు అవసరమైతే సర్దుబాట్లు కూడా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేయడంతో బదిలీల ప్రక్రియ ప్రారంభించనున్నారు.