AP DSC Notification: ఏపీలో మెగా డీఎస్సీ భర్తీకి కొత్త ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. వైసీపీ సర్కార్ జారీచేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దుచేసి.. దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అధికారం చేపట్టిన తరువాత చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ ఫైల్ పైనే పెట్టిన సంగతి తెలిసింది. అటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీని విధివిధానాల ఖరారుపై సంతకం చేశారు. క్యాబినెట్లో సైతం ఈ ఫైల్ ఆమోదముద్ర పొందాయి. నోటిఫికేషన్ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకే ఈ నెల 30న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.
తాను అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తానని 2019 ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. కానీ సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు 6000 పోస్టులతో డీఎస్సీ ప్రకటించారు. ఇందుకుగాను టెట్ పరీక్ష కూడా నిర్వహించారు. తాజాగా ఫలితాలు విడుదలయ్యాయి. అయితే మెగా డీఎస్సీ కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈసారి మెగా డీఎస్సీని టెట్ తో కలిసి నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇప్పటికే టెట్ క్వాలిఫై అయినవారికి మినహాయింపు ఇవ్వనున్నారు.
ఈనెల 30న 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. అనంతరం దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన, పరీక్ష నిర్వహణ, దీంతో పాటే టెట్ నిర్వహణకు వీలుగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో 80 శాతం పోస్టులను స్థానికులకు ఇచ్చేలా, మరో 20 శాతం నాన్ లోకల్ అభ్యర్థులకు కేటాయించేలా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. 26 జిల్లాలకు కాకుండా.. 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.