TRS Disappear: కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు వివిధ ప్రయత్నాలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నీ విఫలమయ్యాక జాతీయ పార్టీ స్థాపనకే మొగ్గు చూపుతున్నారు. ఈ దసరా(అక్టోబర్ 5న) రోజు మధ్యాహ్నం 1:19 నిమిషాలకు పార్టీని ప్రకటించాలని ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా యదాద్రి నృసింహస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. విమానం కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఇక పార్టీ ప్రకటనే మిగిలింది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీ స్థాపించడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి? విధి విధానాలేమిటి? ఒక పార్టీని జాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారనే విషయాలు తెలుసుకుందాం.

దేశంలో బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థ..
భారత్‌లో బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థ అమల్లో ఉంది. అంటే దేశంలో ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు. అలాగే, ఈ పార్టీలను జాతీయ, ప్రాంతీయ పార్టీలుగా ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అయితే, ఇవే కాకుండా ఎన్నికల సంఘంలో నమోదు చేసుకున్న రిజిస్టర్డ్ పార్టీలు కూడా ఉంటాయి.
పార్టీగా గుర్తింపు పొందాలంటే..?
ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన –1968 ప్రకారం చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. లేదా కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. లేదా గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు కనీసం మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.
ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..
ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. రెండు అసెంబ్లీ స్థానాలను గెలవాలి. లేదా ఆ రాష్ట్రంలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లతోపాటు ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి. లేదా ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలవాలి. అదికాకుంటే ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3 శాతం ఓట్లు లేదా మూడు సీట్లు సాధించాలి. లేదా లోక్‌సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలై చెల్లిన ఓట్లలో 8 శాతం ఓట్లు వచ్చి ఉండాలి.
పార్టీ హోదా శాశ్వతం కాదు..
ఒక పార్టీ ఒక ఎన్నికల్లో జాతీయ పార్టీగా లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందితే అదే హోదా శాశ్వతంగా ఉండదు. ఎన్నికల తరవాత పార్టీలు తమ గత హోదాను కలిగి ఉండటం లేదా కోల్పోవడం జరుగుతుంది. దీనివల్లే జాతీయ పార్టీల సంఖ్య, ప్రాంతీయ పార్టీల సంఖ్య మారే అవకాశం ఉంటుంది.
దేశంలో ప్రస్తుతం జాతీయ పార్టీలు ఇవీ..
ప్రస్తుతం దేశంలో 7 జాతీయ పార్టీలు ఉన్నాయి.
1. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2. భారతీయ జనతా పార్టీ
3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – సీపీఐ
4. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) – సీపీఎం
5. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
6. బహుజన్ సమాజ్ పార్టీ
7. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలు
రిజిస్టర్డ్ పార్టీలు అంటే..
జాతీయ, ప్రాంతీయ పార్టీ గుర్తింపు సాధించలేని పార్టీలను రిజిస్టర్డ్ పార్టీలుగా ఎన్నికల సంఘం పరిగణిస్తుంది. కొత్తగా స్థాపించిన పార్టీ ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో పోటీ చేయాలి. 50 కంటే తక్కువ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాలు అయితే కనీసం 5 స్థానాల్లో పోటీ చేయాలి. 20 కంటే తక్కువ లోక్‌సభ స్థానాలు ఉంటే కనీసం 2 స్థానాల్లో పోటీ చేయాలి.
టీఆర్‌ఎస్ ఇక గతమేనా?
అక్టోబర్ 5న జాతీక పార్టీ స్థాపించబోతున్న కేసీఆర్.. మరి ప్రస్తుతం ఉన్న టీఆర్‌ఎస్‌ను ఏం చేస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌నే జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొంతమంది భారత రైతు సమితి పార్టీ పేరుతో రిజిస్టర్ అవుతాయని పేర్కొంటున్నారు. భారత కిసాన్ సమితి పేరుతో కొత్తపార్టీ పెడతారని కూడా తెలుస్తోంది. దాదాపు ఐదు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కొత్త పేరుతో పెడితే టీఆర్‌ఎస్‌కు ఢోకా ఉండదు. అలా కాకుంటే.. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారిస్తే మాత్రం తెలంగాణలో ఇక టీఆర్‌ఎస్ గతమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 22 ఏళ్ల తెలంగాణ రాష్ట్రసమితి ప్రస్థానం ముగిసిపోతుంది. నాలుగు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.