Homeఆంధ్రప్రదేశ్‌Ramoji Rao: అన్నదాత మూతపడింది.. మార్గదర్శి చిక్కుల్లో పడింది... పాపం రామోజీకి ఎన్ని కష్టాలో?

Ramoji Rao: అన్నదాత మూతపడింది.. మార్గదర్శి చిక్కుల్లో పడింది… పాపం రామోజీకి ఎన్ని కష్టాలో?

Ramoji Rao: రామోజీరావు కు ఈ ఏడాది సుడి బాగున్నట్టు కనిపించడం లేదు. ఇటీవలే అన్నదాత మూత పడింది. ఇప్పుడు మార్గదర్శ రూపంలో ఆయనకు మరో చిక్కు వచ్చి పడింది. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి విషయంలో రామోజీరావును ఏకంగా సుప్రీంకోర్టుకు లాగాడు. ఇప్పుడు కూడా వదలా రామోజీ అంటూ వెంట పడుతూనే ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో మార్గదర్శిపై కేసు నమోదయింది కాబట్టి… దీనిపై అప్పట్లో సుప్రీంకోర్టు రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే రామోజీరావుతో తనకు పడటం లేదు కాబట్టి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ కేసులో ఇంప్లిడ్ అయ్యాడు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనాన్ని ఆశ్రయించాడు.. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రామోజీ ఫిలిం సిటీని 1000 నాగళ్ళతో దున్నుతా శపథాలు చేసిన వ్యక్తి ఉలుకు పలుకు లేకుండా ఉండటం నిజంగా ఆశ్చర్యకరమే. ఈ కేసు ఇలా జరుగుతుండగానే ఏపీలో జగన్మోహన్ రెడ్డి మార్గదర్శిపై మరో రూపంలో విరుచుకుపడుతున్నాడు.

Ramoji Rao
JAGAN, Ramoji Rao

లొసుగులు గుర్తించారా?

కొద్దిరోజుల నుంచి మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో ఏపీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే కోరిన వివరాలు ఇవ్వడంలేదని అధికారులు, కంపెనీ వ్యక్తిగత సమాచారం అడుగుతున్నారని మార్గదర్శి.. ఇలా ఇద్దరి మధ్య పరస్పర ఆరోపణలు నడుస్తున్నాయి. ఇది ఇలా ఉండగానే మార్గదర్శి ద్వారా సేకరించిన డిపాజిట్లను ఒక ప్రత్యేక ఖాతాలో నిల్వ ఉంచకుండా రామోజీ అనుబంధ సంస్థలైన ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, ఉషోదయ పబ్లికేషన్స్, రమాదేవి ట్రస్ట్ వంటి కార్పొరేట్ సంస్థలకు మళ్లిస్తున్నారని ఏపీ అధికారులు ఆరోపిస్తున్నారు. పైగా ప్రజల నుంచి వసూలు చేసిన నగదుకు లెక్కలు లేకపోవడం, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కు లావాదేవీల వివరాలు అందించకపోవడాన్ని ఏపీ అధికారులు తప్పు పడుతున్నారు. అయితే మార్గదర్శి సంస్థ వివిధ కంపెనీలతో మెయిల్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నదని, ఇది ఏదో అనుమానంగా ఉందని ఏపీ అధికారులు అంటున్నారు. అయితే ఇటీవల ఈ వివరాలు ఇవ్వాలని కోరితే అందుకు మార్గదర్శి సంస్థ నిరాకరించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కొత్త డిపాజిట్లను సేకరించేందుకు మార్గదర్శికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది. ఒకవేళ రేపు మార్గదర్శికి ఏదైనా జరగరానిది జరిగితే రామోజీరావుకి కుడి భుజం పోయినట్టే.

జగన్ మార్క్ రివెంజ్

అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన రెండు పత్రికల్లో ఈనాడు ముందు వరుసలో ఉంది. అయితే ఈనాడు కుంభస్థలాన్ని కొట్టాలని అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుకున్నారు.. ఆయన వెతుకుతూ ఉంటే మార్గదర్శి కనిపించింది. ఆ మార్గదర్శి లోతుల్లోకి వెళ్లి పరిశీలించే బాధ్యత ఉండవల్లి అరుణ్ కుమార్ కు వైఎస్ అప్పగించారు. అసలే లూప్ హోల్స్ వెతికే ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి లోపాలను కనిపెట్టాడు. అటు వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో రామోజీరావును సుప్రీంకోర్టు దాకా ఈడ్చాడు. అప్పట్లో రిలయన్స్ కంపెనీ అండగా నిలబడకపోయి ఉంటే మార్గదర్శి ఈపాటికి మూతపడి ఉండేది. అప్పట్లో చేసిన సహాయానికి ప్రతిగా రామోజీరావు తన ఈ టీవీ ఛానల్స్ మొత్తం రిలయన్స్ ఆధీనంలో ఉన్న నెట్వర్క్ 18కు బదలాయించారు. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మార్గదర్శి కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళింది. అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అడుగడుగునా ఈనాడు ప్రతి బంధకంగా నిలుస్తోంది. దానిని ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలని బూజు పట్టిన మార్గదర్శి కేసును కొత్త విధానంలో తెరపైకి తీసుకొచ్చాడు.. ఏపీలో మార్గదర్శి సంస్థలపై విస్తృతంగా తనిఖీలు చేయిస్తున్నాడు.

Ramoji Rao
Ramoji Rao

 

తీర్పు రిజర్వ్ లో

మార్గదర్శి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ ముగిసింది. తుది తీర్పును కోర్టు రిజర్వ్ లో పెట్టింది. ఇందుకు కారణం తెలియదు కానీ… ప్రస్తుతం దీనిపై అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు రామోజీరావు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే కోర్టు జరిపిన విచారణలో మార్గదర్శికి సంబంధించిన పలు కీలక విషయాలను ఉండవల్లి అరుణ్ కుమార్ సమర్పించినట్టు తెలుస్తోంది.. ఒకవేళ తీర్పు రామోజీరావుకు వ్యతిరేకంగా వస్తే మాత్రం మార్గదర్శి సంస్థను మూసేయాల్సి ఉంటుంది. నిన్న అన్నదాత, నేడు మార్గదర్శి… ఏమిటో రామోజీరావుకు చరమాంకంలో ఈ పరిస్థితి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular