Crime News : రాకాసి ట్రావెల్ బస్సు.. మరణంలోనూ వీడని ఈ నలుగురి స్నేహం

బుధవారం రాత్రి ఘటన జరిగిన తర్వాత మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. నలుగురు యువకులు ఒకే ఘటనలో మృతి చెందడంతో ఆ గ్రామం శోకసంద్రమైంది.

Written By: NARESH, Updated On : April 25, 2024 8:01 pm

Road Accident

Follow us on

Crime News : ఆ యువకుల వయసు 17 సంవత్సరాల లోపు ఉంటుంది. నూనూగు మీసాలతో… ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వారిని చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని.. తమను భద్రంగా చూసుకుంటారని లోలోపల అనుకుంటున్నారు. కానీ, వారొకటి తలిస్తే.. దైవం ఒకటి తలచింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు మృత్యువు రూపంలో ఆ యువకుల్ని చిదిమేసింది. కన్నవారి కలలను కల్లలు చేసింది.

ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట శివారులోని ఆకేరు వాగు వంతెన వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు దుర్మరణం చెందారు. వారంతా 17 సంవత్సరాల వయసు వారే. వర్ధన్నపేట పట్టణానికి చెందిన పొన్నం గణేష్, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లెపాక సిద్దు, వరుణ్ తేజ్, పొన్నాల రవికుమార్ ఓకే బైక్ పై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తున్నారు.. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు కూడా దుర్మరణం చెందాడు. మృతి చెందిన నలుగురు యువకుల్లో ఒకడైన గణేష్ బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో పాస్ అయ్యాడు. దానిని పురస్కరించుకొని తన ముగ్గురు స్నేహితులతో కలిసి సాయంత్రం పార్టీ చేసుకున్నాడు. ఆ నలుగురు కలిసి ఒకే వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వారిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆ నలుగురు యువకుల్లో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఒక వ్యక్తి ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఇల్లంద గ్రామంలో విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన నలుగురు యువకులు మృతి చెందడం ప్రతి ఒక్కరినీ కలిచి వేస్తోంది. చనిపోయిన నలుగురు కూడా వారి తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులు.. అతివేగం, మూలమలుపు ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వరంగల్ లో ఇటీవల ఒక పార్టీ ప్రచారంలో పాల్గొంది. తిరుగు ప్రయాణంలో అది ఖమ్మం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఘటన జరిగిన తర్వాత మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. నలుగురు యువకులు ఒకే ఘటనలో మృతి చెందడంతో ఆ గ్రామం శోకసంద్రమైంది.