Pawan Kalyan
Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వేళ రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. మంత్రి విడదల రజిని కిడ్నాప్ అయ్యారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసే క్రమంలో ఆమె కిడ్నాప్ అయ్యారని టాక్ నడిచింది. అయితే ఆమె మంత్రి విడదల రజనీకాదని.. ఆమె పేరు కలిగిన మరో మహిళ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన పేరుతో మరో ముగ్గురు పోటీ చేస్తున్నారని తాజాగా ప్రచారం జరుగుతోంది. నామినేషన్ల పర్వానికి సంబంధించి నేటితో గడువు ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో పిఠాపురంలో కె.పవన్ కళ్యాణ్ పేరిట ఇద్దరు పోటీ చేస్తున్నారని తెలియడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రంలో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం కీలకం. అక్కడ ఏ చిన్న పరిణామం జరిగినా.. రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి వైసిపి సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవడం లేదు. అందులో భాగంగానే ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును.. ఇండిపెండెంట్ లకు దక్కేలా పావులు కదుపుతోంది. ప్రస్తుతం ఈ అంశం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది. కేవలం జనసేనకు మాత్రమే గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని ఆ పార్టీ నాయకత్వం ఎలక్షన్ కమిషన్ కు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. మరోవైపు గాజు గ్లాస్ గుర్తుకు దగ్గరగా ఉండేలా కొన్ని గుర్తులను దక్కించుకునేందుకు ఇండిపెండెంట్ లు పావులు కదుపుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో సైతం ఇదే ఫార్ములాను అనుసరించి జనసేన ను దెబ్బ కొట్టారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తుండడం విశేషం.
తాజాగా సోషల్ మీడియాలో మరో ప్రచారానికి తెర తీశారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పేరుతో మరికొంతమంది పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. జనసేన అధినేత తో పాటు కోనేటి పవన్ కళ్యాణ్, కనుమూరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు నామినేషన్ వేసినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈసీ వెబ్సైట్ ప్రకారం పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ పేరుతో ఒక్కరే పోటీలో ఉన్నారు. నామినేషన్ గడువు ముగిసే సమయానికి 11 మంది పోటీ చేస్తున్నట్లు తేలింది. కేవలం పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడించేందుకు జరగని ప్రయత్నం అంటూ లేదు. అయితే దీనిని ముందుగానే పసిగట్టిన జనసేన పార్టీ శ్రేణులను అలెర్ట్ చేసింది. అటువంటి పుకార్లను నమ్మవద్దని పార్టీ శ్రేణులకు అంతర్గతంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.