Ghaziabad: అది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం.. ఘజియాబాద్ నగరం. ఆ నగరంలో ముగ్గురు సోదరీమణులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దీంతో క్రైమ్ సినిమా మాదిరిగా దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
నేటి కాలంలో చాలామంది యువత ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిపోతున్నారు. కొందరైతే ఆటలకు బానిసలుగా మారిపోయి డబ్బులను తగలేసుకుంటున్నారు. కెరియర్ ను నాశనం చేసుకుంటున్నారు. చదువును కూడా దూరం పెడుతున్నారు. చివరికి అప్పులు పెరిగిపోయి.. ఇంట్లో సమాధానం చెప్పలేక దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇప్పటివరకు ఆన్లైన్ గేమ్స్ కు బానిసలుగా కేవలం అబ్బాయిలు మాత్రమే ఉండేవారు. మీడియాలో వారికి సంబంధించిన వార్తలు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు ఈ జాబితాలో అమ్మాయిలు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఘజియాబాద్ ప్రాంతంలో ముగ్గురు సోదరీమణుల చావు వెనుక జరిగింది కూడా ఇదేనట.. కొరియన్ గేమింగ్ యాప్ కు బానిసలుగా మారిన ముగ్గురు సోదరీమణులు గడిచిన రెండున్న సంవత్సరాలుగా ఈ ఆట ఆడుతున్నారు. నిత్యం ఫోన్లోనే ఉండేవారు. కుటుంబ సభ్యులతో కూడా దూరంగా ఉండేవారు. ఇందులో ఒకరు ఇన్స్ట్రక్టర్ గా ఉండేవారు. మిగతావారు ఆమె ఇచ్చిన ఆదేశాలు పాటించేవారు. అయితే వారి ఫోన్లలో చివరి టాస్క్ ఆత్మహత్య అని ఉండేది. దీంతో ఆ ముగ్గురు సోదరీమణులు కూడా ఆ టాస్క్ మాదిరిగానే చనిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు.
ఆ ముగ్గురు సోదరీమణులు నివాసం ఉండే పక్క ఇంటి వ్యక్తి పోలీసులకు సంచలన నిజాలు చెప్పాడు. ఆ ఆటలో భాగంగా ఆ ముగ్గురు సోదరీమణులు కింద పడిపోతుండగా పక్క ఇంటి వ్యక్తి ప్రత్యక్షంగా చూశాడు. చనిపోవడానికి ముందు వారు బాల్కనీలో కూర్చున్నారట. ఆ తర్వాత మరొక అమ్మాయి రైలింగ్ పై కూర్చుందట. ఆ అమ్మాయిని ఇంకొక అమ్మాయి తోసి వేసింది. ఇలా అందరూ వెంటవెంటనే కింద పడిపోయారు.. తీవ్రంగా గాయపడ్డారు. ఆ విషయాన్ని ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఆ ముగ్గురు సోదరీమణుల తల్లిదండ్రులకు చెప్పాడు. వారు వచ్చేసరికి ఘోరం జరిగిపోయింది. అంబులెన్స్ కు ఫోన్ చేస్తే చాలా సమయం వరకు రాలేదు. దీంతో ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.