Maharashtra: వాహనాల రాకపోకలను సక్రమ మార్గంలో వెళ్లేలా చూడటం.. హెల్మెట్ ధరించని వారి నుంచి ఫైన్ వసూలు చేయడం.. నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్ ను తరలించడం… రోడ్డు భద్రత నియమాల గురించి వివరించడం.. ఇవి ట్రాఫిక్ పోలీసుల విధులు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ట్రాఫిక్ పోలీసులు పూర్తి డిఫరెంట్.. తాము ఆదేశాలు జారీ చేసినప్పటికీ కారు ఆపలేదని.. క్యాబ్ డ్రైవర్ పై దాష్టీకాన్ని ప్రదర్శించారు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
మహారాష్ట్ర చెందిన ఓ వ్యక్తి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం తనకు ఏదో కిరాయి తగలడంతో కారు తీసుకొని వెళ్తున్నాడు. ఈలోగా ఛత్రపతి శంభాజీ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే మార్గంలో వెళ్తున్న క్యాబ్ డ్రైవర్ కారుని ఆపకుండా వేగంగా వెళ్లాడు. అది ట్రాఫిక్ పోలీసులకు చిరాకు తెప్పించింది. తాము ఆపమని చెప్పినప్పటికీ.. ఆపకుండా వెళ్లడంతో కోపం నషాళానికి అంటింది. ఇంకేముంది అతని వాహనాన్ని వెంబడించారు. చివరికి ఎలాగోలా పట్టుకున్నారు.. ఇక అంతే అతన్ని బయటకు తీసుకొచ్చారు. ఒక ట్రాఫిక్ పోలీస్ మూడు, నాలుగు చెంప దెబ్బలు కొట్టాడు. మరో ట్రాఫిక్ పోలీస్ లాఠీతో నాలుగైదు దెబ్బలు వేశాడు.
అక్రమార్కులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలను రవాణా చేస్తున్నారనే అనుమానంతో ట్రాఫిక్ పోలీసులు ఆ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ క్యాబ్ డ్రైవర్ అలాగే వాహనాన్ని నిలుపుదల చేసి.. పోలీసులకు సహకరిస్తే ఇక్కడ దాకా పరిస్థితి వచ్చేది కాదు. పైగా పోలీసులు కూడా విచక్షణ కోల్పోయి ఆ క్యాబ్ డ్రైవర్ పై ముకుమ్మడిగా తమ జులుం ప్రదర్శించారు. ఒక పోలీసు పట్టుకోగా.. మరొక పోలీస్ ఆ క్యాబ్ డ్రైవర్ ను చితకబాదాడు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో తెగ ఫైరల్ గా మారడంతో.. మహారాష్ట్ర హోంశాఖ దృష్టికి వెళ్ళింది. దీనిపై వివరాలు తెలియజేయాలంటూ హోంశాఖ శంభాజీ నగర్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించింది.. తనను కొట్టొద్దని ఆ క్యాబ్ డ్రైవర్ కోరుతున్నప్పటికీ.. పోలీసులు అదే తీరుగా దాడికి పాల్పడడం విస్మయాన్ని కలిగిస్తోంది.
మహారాష్ట్ర – ఛత్రపతి శంభాజీనగర్‌లో కారు ఆపలేదని క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన ట్రాఫిక్ పోలీసులు pic.twitter.com/K0yhLaQbQh
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2024