Bhadradri Kothagudem: పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు.. చివరికి విద్యార్థుల చేతిలో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందులపాడు అనే ఒక గ్రామం ఉంది. ఇది మారుమూల పల్లెటూరు. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 29, 2024 8:21 am

Bhadradri Kothagudem

Follow us on

Bhadradri Kothagudem: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లిదండ్రుల తర్వాత.. అంతటి స్థానం గురువు దే. తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువు మాత్రం విద్యాబుద్ధులు నేర్పి.. మంచి నడవడికను అలవర్చి.. సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మార్చుతాడు. ప్రస్తుత సమాజంలో గొప్ప గొప్ప వాళ్లంతా.. వారి గురువుల చేతిలో బెత్తం దెబ్బలు తిన్నవాళ్లే. వారి ద్వారా పాఠాలు నేర్చుకున్న వాళ్ళే.. అందుకే మంచి గురువు అద్భుతమైన సమాజాన్ని నిర్మిస్తాడు అంటారు.. కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన గురువు దారి తప్పాడు.. చివరికి విద్యార్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందులపాడు అనే ఒక గ్రామం ఉంది. ఇది మారుమూల పల్లెటూరు. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఈ పాఠశాలలో కాల్వ సుధాకర్ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. సుధాకర్ కు మద్యం తాగే అలవాటు ఉంది. ఇటీవల అది పెచ్చు మీరింది. ఏకంగా మద్యం తాగి పాఠశాల విధులకు హాజరవుతున్నాడు. అంతేకాకుండా విద్యార్థులతో అనేక రకాల పనులు చేయిస్తున్నాడు. చివరికి వారిని పచ్చి బూతులు తిడుతున్నాడు. పాఠాలు చెప్పడం పక్కనపెట్టి.. క్లాస్ రూమ్ లోనే పడుకుంటున్నాడు.

ఇలా చాలా రోజులపాటు ఆ ఉపాధ్యాయుడి ఆగడాలు భరించిన ఆ విద్యార్థులు.. విసిగి వేసారి పోయి.. ఆ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు ఒక ప్రణాళిక రూపొందించారు. శుక్రవారం యధావిధిగా సుధాకర్ మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు.. కనీసం విద్యార్థులను పట్టించుకోలేదు. పైగా వారిని యథా లాపంగా బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అక్కడే కాపు కాసి ఉన్న ఆ విద్యార్థుల తల్లిదండ్రులు సుధాకర్ ఉన్న గదికి తలుపులు వేసి తాళం వేశారు. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు హుటాహుటిన పాఠశాల వద్దకు రాగా సుధాకర్ “మద్యావతారం” కళ్లకు కట్టింది. దీంతో వారు రెండవ మాటకు తావు లేకుండా ఆ ఉపాధ్యాయుడిని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాఠశాలకు వచ్చి సుధాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సుధాకర్ పోలీసుల అదుపులో ఉన్న నేపథ్యంలో.. వెంటనే మరో ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్ పై ఆ పాఠశాలకు పంపించారు. కాగా సుధాకర్ ను పాఠశాల గదిలో బంధించి, తాళం వేసిన దృశ్యాలను కొంతమంది సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.