Dharmapuri Srinivas Passed Away: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున 3.30 గంటలకు గుండోపోటుతో తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస్ చిన్న కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘అన్నా అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో ఉన్నా ఆదుకునే శీనన్న ఇక లేదు. I WILL MISS YOU DADDY.. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే.. ఎదురొడ్డు.. పోరాడు.. భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు, ప్రజల కోసం జీవించు అని చెప్పింది మా నాన్నే.. నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నా లోనే ఉంటావు’ అని ఎంపీ అరవింద్ ట్వీట్ చేశారు.
సుదీర్ఘ రాజకీయ జీవితం..
ఇదిలా ఉంటే.. ధర్మపురి శ్రీనివాస్ సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989, 1999, 2004లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘ కాలం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేశారు.
సక్సెస్‌ఫుల్ పీసీసీ చీఫ్..
ధర్మపురి శ్రీనివాస్ 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. నాడు అసెంబ్లీలో సీఎల్పీ నేతగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నారు. ఈ డీఎస్ పీసీసీ చీఫ్‌గా వైఎస్సార్ ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. ఇద్దరు నేతలు సక్సెస్‌ఫుల్‌గా పనిచేసి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ఈ సమయంలో డీఎస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగానా గ్రామీణాభివృద్ధి మంత్రి పదవితోనే సరిపుచ్చారు. తర్వాత పీసీసీ అధ్యక్షుడు మారారు. మళ్లీ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం మరోమారు డీఎస్‌నే పీసీసీ చీఫ్‌గా నియమించింది. దీంతో మరోమారు డీఎస్, వైఎస్సార్ కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి తెచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలోనూ కాంగ్రెస్‌ను వీరు అధికారంంలోకి తీసుకువచ్చారు. దీంతో సక్సెస్‌ఫుల్ పీసీసీ చీఫ్‌గా గుర్తింపు పొందారు.
రాష్ట్ర విభజన తర్వాత బీర్ఎస్‌లోకి..
తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ధర్మపురి శ్రీనివాస్ బీఆర్ఎస్(టీఆర్ఎస్)లో చేరారు. కొద్ది రోజులు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
అనారోగ్యంతో రాజకీయాలకు దూరం..
2019 తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రాజ్యసభ ఎంపీ పదవి ముగిసిన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో వయోభారంతో ఆయన ఆరోగ్య సమస్యలు పెరిగాయి.
ఇద్దరు కుమారులు..
ధర్మపురి శ్రీనివాస్ స్వగ్రామం నిజాబాబాద్ జిల్లా. 1948, సెప్టెంబర్ 25న ఆయన జన్మించారు. శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సంజయ్ నిజామాబాద్ మేయర్‌గా పనిచేశారు. చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్. బీజేపీ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు.