https://oktelugu.com/

Child Files Complaint : తల్లి చనిపోయింది.. అన్నీ తనే కావాల్సిన తండ్రి పైశాచికం.. పాపం ఈ బాలిక కష్టం పగవాడికి కూడా రావొద్దు!

తొమ్మిది మాసాలు మోసి కన్న తల్లిని కరోనా బలితీసుకుంది. ఆ సమయంలో అన్నీ నేనే అవుతానని మాట ఇచ్చిన తండ్రి మాట తప్పాడు. తల్లి లేని కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి.. ఆమెపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. తట్టుకోలేక ఆ బాలిక ఏం చేసిందంటే..

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2024 10:01 pm

    Child Files Complaint

    Follow us on

    Child Files Complaint : ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందిన గడ్డం అనిత కోవిడ్ సమయంలో కన్నుమూసింది.. అనితకు భర్త పెద్ద రాజం ఉన్నాడు.. అనిత – పెద్ద రాజం దంపతులకు గంగజల అనే కూతురు ఉంది. ఆమె ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. అనిత చనిపోయిన తర్వాత పెద్ద రాజం లచ్చవ్వ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. గంగజలను పెద్ద రాజం నిత్యం కొడుతున్నాడు. ఇటీవల లచ్చవ్వకు జ్వరం వచ్చింది. ఆమెను జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెతోపాటు గంగాజల కూడా జగిత్యాలకు వచ్చింది. అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది.. తన తండ్రి నిత్యం కొడుతున్నాడని.. అతడు కొడుతున్న దెబ్బలకు తట్టుకోలేకపోతున్నానని.. గంగజల వాపోయింది. తనను ఏదైనా హాస్టల్లో వేయాలని పోలీసులను వేడుకుంది. తన శరీరంపై ఉన్న దెబ్బలను పోలీసులకు చూపించింది. ఆ దెబ్బలను చూసిన పోలీసులు చలించిపోయారు. వెంటనే జిల్లా సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ బాలికకు వసతి కల్పించాలని వారిని కోరారు. అయితే పెద్ద రాజం పోలీసులు ఆరా తీశారు.. అయితే అతడు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు.

    భార్య చనిపోవడంతో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు

    అనిత – పెద్ద రాజం దంపతులకు గంగజల ఒకతే కూతురు. అనిత చనిపోయిన సమయంలో తాను మళ్ళీ పెళ్లి చేసుకోనని పెద్దరాజం బంధువులతో చెప్పాడు. కానీ కొద్ది రోజులకే తన మనసు మార్చుకుని లచ్చవ్వ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న నాటి నుంచి గంగజలను పెద్ద రాజం ఇబ్బంది పెడుతున్నాడు. అనిత చనిపోయినప్పుడు గంగజల మూడో తరగతి చదువుతోంది. ప్రస్తుతం ఆమె ఏడో తరగతికి వచ్చింది. తల్లి లేని పిల్లను అపురూపంగా చూసుకోవలసిన పెద్ద రాజం.. ఆ బాలికను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు. మద్యం తాగి వచ్చి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. కారణం లేకుండా తీవ్రంగా కొడుతున్నాడు. అతడు కొడుతున్న దెబ్బలను తట్టుకోలేక గంగజల పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమెను కొద్ది రోజుల్లోనే వసతి గృహానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.. అయితే గంగజలను పెద్ద రాజ్యం కొడుతున్న నేపథ్యంలో పోలీసులు జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న లచ్చవ్వ ను ప్రశ్నించగా.. వివరాలు చెప్పడానికి నిరాకరించినట్టు తెలుస్తోంది. అయితే ఆ బాలిక ఎట్టి పరిస్థితుల్లోనూ తన తండ్రి వద్దకు వెళ్ళనని చెప్పడం పోలీసులను కూడా కంటతడి పెట్టించింది. సాధారణంగా తల్లి ఏదైనా కారణం వల్ల చనిపోతే తండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఆ బాధ్యతను పెద్దరాజం విస్మరించాడు. ఆ బాలికపై చిత్రహింసలకు పాల్పడుతున్నాడు. వాటిని తట్టుకోలేక గంగజల పోలీసులను ఆశ్రయించింది. స్థానికంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియడంతో.. పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.