Road Accident: మద్యపానం అనేది మంచిది కాదు. అలానే మద్యం తాగుతుంటే ఒంట్లో ఉన్న అవయవాలు పాడవుతాయి. లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. విద్యాధికుడైన ఆ వ్యక్తికి ఈ విషయం తెలుసు. అయినప్పటికీ అతడు అదేపనిగా మద్యం తాగుతున్నాడు. తాగినవాడు తన మానాన తను ఉన్నా ఇబ్బంది లేకపోయేది. అంతటి ఘోరం జరిగి ఉండకపోయేది. కానీ అతడు తాగిన మైకంలో కారు డ్రైవింగ్ చేశాడు.. ఆ మత్తులో ఇష్టానుసారంగా వాహనాన్ని తోలడంతో దారుణం జరిగింది.. సభ్య సమాజం విస్తుపోయే ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వైకొత్తపల్లి జాతీయ రహదారిపై జరిగింది.
అనంతపురం జిల్లా కూడేరు మండలం చోలసముద్రం గ్రామానికి చెందిన జిన్నే ఎర్రి స్వామి (35) వృత్తిరీత్యా ట్రాక్టర్ మెకానిక్. అతడు ఆత్మకూరు మండలం పి. సిద్ధరాం పురానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకొని అనంతపురంలో స్థిరపడ్డాడు.. వ్యక్తిగత పనిమీద పి. సిద్ధరాంపురం వెళ్లి ఆదివారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై అనంతపురం తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో వై . కొత్తపల్లి సమీపంలోకి వచ్చాడు. అక్కడి జాతీయ రహదారిపై కళ్యాణదుర్గం వైపు వెళుతున్న కారు ఎర్రి స్వామి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.. దీంతో ఎర్రి స్వామి ఎగిరి కారుపై పడిపోయాడు. గమనించని ఆ డ్రైవర్ వేగంగా కళ్యాణదుర్గం వైపు కారును పోనిచ్చాడు. ఈ క్రమంలో బెలగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద ఆ కారుపై ఉన్న ఎర్రి స్వామి మృతదేహాన్ని వాహనదారులు గమనించారు. కారుకు అడ్డంగా నిలబడి ఆపారు. అనంతరం వాహనదారులు మృతదేహాన్ని కిందికి దించారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
వాహనదారులు కారును ఆపినప్పుడు దానిని నడుపుతున్న వ్యక్తి వెంటనే కిందికి దిగాడు. అతడు కనీసం అక్కడ ఆగే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా తీవ్రమైన మద్యం మత్తులో ఉన్నాడు. అలానే పరిగెత్తుకుంటూ పారిపోయాడు. కాగా, నంబర్ ఆధారంగా పరిశీలిస్తే ఆ కారు బెంగళూరు ప్రాంతానికి చెందినదని పోలీసులు గుర్తించారు. సిసి ఫుటేజ్ రికార్డులు పరిశీలించారు. కారు తోలిన వ్యక్తి పలు ప్రాంతాలలో వాహనం ఆపి మద్యం తాగినట్టు గుర్తించారు. ఆ మద్యం మత్తులోనే అతడు కారును నడిపాడు. పైగా హైవే కావడంతో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపాడు. కారు పైన నియంత్రణ కోల్పోవడంతో ఎర్రిస్వామిని అలాగే ఢీకొట్టాడు. ప్రమాదం తీవ్రత అధికంగా ఉండడంతో ఎర్రి స్వామి అక్కడికక్కడే చనిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతని రక్తంతో కారు వాహనం పైభాగం మొత్తం తడిచిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారుపై ఎర్రి స్వామి మృతదేహంతో 18 కిలోమీటర్లు ప్రయాణించిన డ్రైవర్ పై స్థానికుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుడిది పేద కుటుంబమని, ఇప్పుడిప్పుడే ఆర్థికంగా స్థిరపడుతున్నాడని అతని బంధువులు చెప్తున్నారు..కాగా, ఈ సంఘటన సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది..