Byjus India : కోవిడ్ సమయంలో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాలతో సతమతమవుతోంది. గత రెండు సంవత్సరాల నుంచి ఈ సంస్థకు సంబంధించి ఏదో ఒక వార్త మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇటీవల ఈ సంస్థకు సంబంధించిన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో.. మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బైజూస్ భారతీయ విభాగం సీఈఓ అర్జున్ మోహన్ సోమవారం రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ సంస్థలో మరో కలకలం నెలకొంది.
అర్జున్ రాజీనామా నేపథ్యంలో బైజు రవీంద్రన్ రోజువారి కార్యకలాపాలు పర్యవేక్షిస్తారని బైజుస్ సంస్థ ప్రకటించింది. రవీంద్రన్ క్యాట్ కోచింగ్ ఇస్తున్న తొలి రోజుల్లో అర్జున్ అతడికి విద్యార్థి కావడం విశేషం. సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన అర్జున్ కేవలం 6 నెలలు మాత్రమే బై జూస్ సంస్థలో పనిచేశారు. ప్రస్తుతం సంస్థ పునర్వ్యవస్థీకరణ కీలక దశలో ఉండగా ఆయన రాజీనామా చేయడం సంచలనంగా మారింది. రాజీనామా చేసినప్పటికీ ఆ సంస్థకు సలహాదారుడిగా అతడు కొనసాగుతాడని తెలుస్తోంది. అర్జున్.. రవీంద్రన్ కు అత్యంత సన్నిహితుడని సంస్థలో పనిచేసే ఉద్యోగులు చెబుతున్నారు. వాస్తవానికి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న బై జూస్ సంస్థలో రవీంద్రన్ సీఈవోగా వచ్చిన తర్వాత కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆర్థిక పొదుపు పేరుతో చాలామంది ఉద్యోగులను అర్జున్ తొలగించారు. చాలావరకు కార్యాలయాలను మూసివేశారు. ఇంటి వద్ద నుంచి పని చేస్తే అవకాశం ఉద్యోగులను కల్పించారు. ఇక ఈ సంస్థకు సంబంధించిన ఆకాష్ అనే కళాశాల కార్యకలాపాలు కూడా అర్జున్ దగ్గరుండి పర్యవేక్షించారు. అర్జున్ మూడు సంవత్సరాల క్రితం బైజూస్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా పని చేశాడు. మధ్యలో కొద్ది రోజులు ఆప్ గ్రేడ్ సంస్థ సీఈవోగా వెళ్లిపోయారు. అక్కడ రాజీనామా చేసి గత ఏడాది సెప్టెంబర్ నెలలో తిరిగి బై జూస్ సంస్థకు వచ్చారు.
అర్జున్ రాజీనామా ఎందుకు చేశారనే విషయాన్ని సంస్థ బయటకి చెప్పడం లేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆర్థిక కష్టాలు తీవ్రతరం కావడం.. చాలామంది ఉద్యోగులను తొలగించడం.. ఉన్నవారికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడం.. కేంద్ర దర్యాప్తు సంస్థల ఆధీనంలో ఆస్తులను విడిపించే మార్గం లేకపోవడంతో.. అర్జున్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. వేతనాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు బయటికి వెళ్లిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు అర్జున్ రాజీనామా నేపథ్యంలో బై జూస్ కార్యకలాపాలను మూడు విధాలుగా రవీంద్రన్ విభజించే అవకాశం కనిపిస్తోంది. యాప్ అండ్ ఏఐ, టెస్ట్ ప్రిపరేషన్, ట్యూషన్ సెంటర్లుగా వర్గీకరిస్తారని తెలుస్తోంది. ఇక ఆర్థిక కష్టాల నేపథ్యంలో ట్యూషన్ సెంటర్లను కూడా 250కి తగ్గించారు.