Octopus Thief Video: గాజు గ్లాసులోకి ఆక్టోపస్ ఎలా జారుకుంటుంది.. ఆ దృశ్యం చూస్తేనే వింతగా ఉంటుంది కదా. అలాంటిది మనుషులు చేస్తారా.. మనుషులు అలా చేయడం సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నలకు లేదు అనే కదా సమాధానం వస్తోంది..
కానీ మహారాష్ట్రలోని నాగ్ పూర్ ప్రాంతంలో ఓ దొంగ మాత్రం దానిని నిజం చేసి చూపించాడు. ఆక్టోపస్ మాదిరిగా దుకాణంలోకి దూరి దొంగతనం చేశాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఆ దృశ్యాలు అతడి చోర కళ కు నిదర్శనంగా నిలుస్తున్నాయి.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ ప్రాంతంలో ఒక వైన్ షాప్ ఉంది. రాత్రి 10 తర్వాత ఆ వైన్ షాప్ ను క్లోజ్ చేశారు. షట్టర్లకు తాళాలు గట్టిగా వేశారు. అయినప్పటికీ ఓ దొంగ అందులోకి చేరుకున్నాడు. అత్యంత చాకచక్యంగా అందులోకి ప్రవేశించాడు. కౌంటర్ వద్ద ఇనుప గ్రిల్ ఏర్పాటు చేసినప్పటికీ.. అందులో నుంచి ఆక్టోపస్ జారుకున్నట్టు జారుకున్నాడు. చిన్న కౌంటర్ గ్రిల్ రంద్రం నుంచి లోపలికి అత్యంత సులభంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత కౌంటర్ పెట్టాలో ఉన్న 25వేల నగదును దొంగిలించాడు.. ఆ తర్వాత అంతే వేగంగా వెనక్కి వచ్చాడు. అతడు దొంగతనం చేస్తున్న దృశ్యాలు వైన్ షాప్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో నమోదయ్యాయి.
Also Read: Thief: గుడిలో దొంగతనం.. క్షమించాలని గుడి వస్తువులు తిరిగిచ్చిన దొంగ
మరుసటి రోజు షాపు ఓపెన్ చేయగా నిర్వాహకులకు దిమ్మ తిరిగిపోయింది. కౌంటర్ లో ఉన్న 25వేల నగదు కనిపించలేదు. కౌంటర్ కూడా పగలగొట్టి ఉంది. దీంతో అనుమానం వచ్చిన నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడున్న ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. ఫుటేజ్ స్వాధీనం చేసుకొని.. అందులో దృశ్యాలను చూడగా దొంగ చాకచక్యంగా వైన్ షాప్ లోకి వెళ్తున్నట్టు కనిపించింది. పైగా చిన్న రంధ్రంలో దూరి దొంగ దొంగతనం చేయడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఆ దొంగ దొంగతనం చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను పోలీసులు మీడియా ప్రతినిధులకు అందిస్తే.. వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ దొంగ చాకచక్యం సభ్య సమాజానికి తెలిసింది. సోషల్ మీడియాలో పడిన తర్వాత ఈ వీడియో వైరల్ గా మారింది. “కౌంటర్ దగ్గర ఉన్నదే చిన్నపాటి రంధ్రం. అందులో దూరడం అంత సామాన్యమైన విషయం కాదు. అందులో దూరి డబ్బులు దొంగిలించావంటే నువ్వు మామూలోడివి కాదు. గజదొంగలకే గజదొంగలాంటోడివి. స్టువర్టుపురం దొంగలు కూడా నిన్ను చూస్తే మిన్న కుండిపోతారు.. బాబోయ్ నువ్వు మామూలోడి కాదు భయ్యా అంటూ” సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అన్నట్టు సిసి ఫుటేజ్ రికార్డు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులను ప్రశ్నించి వదిలేస్తున్నారు. అయితే కౌంటర్ దగ్గర ఉన్న చిన్న రంధ్రంలో నుంచి లోపలికి వెళ్లడం అంత సులువైన విషయం కాదని.. ఇది తెలిసిన వారి పనై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.