Bandi Bhageerath arrest: తనపై నమోదైన పోక్సో కేసు కొట్టేయాలని బండి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు వినకుండా తీర్పు ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇక ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ పిటిషన్లోనూ రిలీఫ్ ఇవ్వలేదు.
తుది తీర్పు వరకు బెయిల్ కుదరదు..
బండి భగీరథ్ పిటిషన్ హైకోర్టు మొదట విచారించి, తీర్పు వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మరోవైపు పోలీసులు ఆ నిర్ణయం వచ్చే వరకూ అతన్ని అరెస్టు చేయాలని వేగంగా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.
ఈనెల 21న తుది ఉత్తర్వులు..
భగీరథ్ పిటిషన్‌పై ఈనెల 21న తుది ఉత్తర్వులు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. 3 గంటలకుపైగా వాదనలు జరిగాయి. అయినా హడావుడిగా ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి పేర్కొన్నారు. గత తీర్పులను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే గురువారం వరకు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా, అందుకు కూడా కోర్టు నిరాకరించింది.
అరెస్ట్ తప్పదా?
సిట్ ఇప్పటికే భగీరథ్‌ను విచారణకు పిలిచింది. కానీ ఆయన రెండు రోజులు గడువు కోరుతూ సిట్‌కు లేఖ రాశారు. ఈసారి భగీరథ్ విచారణకు హాజరైతే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మైనర్‌పై లైంగిక దాడి చేసినట్లు పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సాధారణ వ్యక్తులు అయితే ఇప్పటికే అరెస్టు చేసేవారు. అయితే బాధితురాలు మైనర్ కాదని, పోక్సో కేసు కొట్టేయాలని నిందితుడు కోర్టును ఆశ్రయించడం గమనార్హం. దీంతో కేంద్ర మంత్రి కొడుకు కావడంతో పోలీసులు జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
