https://oktelugu.com/

Nagpur: ఈ కోడలు జగత్ కిలాడి.. 300 కోట్ల కోసం ఎంతటి దారుణానికి ఒడిగట్టిందంటే..

మహారాష్ట్రలోని నాగ్ పూర్ నగరంలోని మానేవాడ కాంప్లెక్స్ లో పురుషోత్తం పుట్టేవార్(82) మే 22న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయనను ఒక కారు ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 8, 2024 7:51 am
    Nagpur

    Nagpur

    Follow us on

    Nagpur: పైసల కోసం ఎలాంటి పనికిమాలిన పనులు చేసేందుకైనా కొందరు వెనుకాడటం లేదు. డబ్బులను సులభంగా సంపాదించేందుకు అడ్డగోలుదారుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అయిన వాళ్ళను మోసం చేసేందుకు.. చివరికి అంతమొందించేందుకు కూడా వెనుకాడడం లేదు.. ఈ దశలో రక్తసంబంధాలను, అనుబంధాలను మనుషులు మర్చిపోతుండడం ఆవేదన కలిగిస్తోంది. మానవత్వం రోజురోజుకు మంట కలిసిపోవడం నిర్వేదాన్ని మిగులుస్తోంది. ఇలా డబ్బుల మోజులో పడి ఓ మహిళ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే దారుణానికి పాల్పడింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.

    డబ్బుల కోసం ఓ కోడలు తన సొంత మామను చంపేసింది. దీనిని ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా చూపించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. చివర్లో పోలీసుల విచారణలో అసలు విషయం తెలియడంతో.. ఆ జగత్ కిలాడి చెరసాలకు వెళ్లక తప్పలేదు. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

    మహారాష్ట్రలోని నాగ్ పూర్ నగరంలోని మానేవాడ కాంప్లెక్స్ లో పురుషోత్తం పుట్టేవార్(82) మే 22న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయనను ఒక కారు ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రాథమిక విచారణలో భాగంగా దీనిని ప్రమాదంగా తేల్చేశారు. అయితే ఈ ఘటనపై పురుషోత్తం తమ్ముడికి అనుమానాలు ఏర్పడ్డాయి. దీంతో అతడు పోలీసులకు తన మదిలో ఉన్న అనుమానాలను తెలియజేయడంతో.. వారు ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు.

    ఇలా ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుంటే ఒక్కో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులకు ఈ కేసు ఒక సవాల్ గా మారింది.. ముందుగా సీసీటీవీ రికార్డులను పరిశీలించిన పోలీసులు.. ప్రమాదానికి కారణమైన నీరజ్ నిమ్జే, సచిన్ ధర్మిక్ అనే వ్యక్తులను లోతుగా విచారించారు. దీంతో వారు అర్చన పుట్టేవార్ నుంచి డబ్బులు తీసుకుని.. ఆమె చెప్పినట్టుగా పురుషోత్తాన్ని కారుతో ఢీ కొట్టి చంపించామని పేర్కొన్నారు.. ఎందుకు అలా చేశారని పోలీసులు అడిగితే.. 300 కోట్ల ఆస్తి కోసమే అర్చన తమతో ఈ పని చేయించిందని వారు వివరించారు..

    పురుషోత్తానికి తన పూర్వీకుల నుంచి భారీగా ఆస్తి వచ్చింది. ఆ ఆస్తి విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 300 కోట్లకు చేరుకుంది. ఈ ఆస్తిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని అర్చనకు మొదటి నుంచి కోరిక ఉండేది. పైగా తన భర్త అమాయకుడు కావడంతో.. అతడిని కూడా అడ్డు తొలగించుకొని.. ఈ ఆస్తితో.. తనకు నచ్చిన వ్యక్తితో.. విలాసవంతమైన జీవితాన్ని గడపాలని భావించింది.. అయితే అర్చన ప్లాన్ ఒక్కసారిగా ఎదురు తన్నింది. ఫలితంగా పోలీసులు ఆ ఇద్దరు డ్రైవర్లను, అర్చనను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అన్నట్టు అర్చన మహారాష్ట్ర లో ఓ ప్రభుత్వ శాఖలో అధికారిగా పని చేస్తోంది..

    “ఇలాంటి కేసు మేము ఇంతవరకు చూడలేదు. స్థూలంగా చెప్పాలంటే ఇది హై ప్రొఫైల్ కేసు. నాగ్ పూర్ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఈ కేసును తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. 300 కోట్ల ఆస్తి కోసం పురుషోత్తాన్ని అర్చన చంపేసిందని మా విచారణలో తేలింది. ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశాం. కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఇంకా చాలా విషయాలు వెల్లడి కావలసి ఉంది. త్వరలోనే వాటి గురించి చెబుతామని” నాగ్ పూర్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.