https://oktelugu.com/

Ramoji Rao : తీవ్ర అనారోగ్యంతో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

Ramoji Rao చివరికి శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీ కుమారుడు సుమన్, శైలజ, ఇతర కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆస్పత్రి వద్ద ఉన్నారు. రామోజీ మృతదేహాన్ని ఫిలిం సిటీకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Written By: , Updated On : June 8, 2024 / 07:33 AM IST
Ramoji Rao

Ramoji Rao

Follow us on

Ramoji Rao : ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం ఉదయం నానక్ రామ్ గూడ లోని స్టార్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొద్దిరోజుల నుంచి రామోజీరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రక్తపోటులో నియంత్రణ లేకపోవడం.. ఇతర సమస్యల నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ ప్రాంతంలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

రక్తపోటు ఎంతకూ నియంత్రణలోకి రాకపోవడంతో ఆయన గుండెకు వైద్యులు స్టంట్ వేశారు.. దీంతో రక్తపోటు కొంతమేర తగ్గినప్పటికీ.. ఇతర సమస్యలు తలెత్తాయి. దీంతో ఆయనను వెంటిలేటర్ పై ఉంచి.. వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. రామోజీరావు కొన్ని సంవత్సరాల క్రితం కోలన్ క్యాన్సర్ బారిన పడ్డారు. దాని నివారణ కోసం చికిత్స తీసుకున్నారు.. తర్వాత కోలుకున్నారు. అనంతరం ఆయన తన పనుల్లో నిమగ్నమయ్యారు. గతంలో మాదిరే ఈనాడు, ఫిలిం సిటీ, ఈటీవీ భారత్, డాల్ఫిన్.. వంటి వాటి వ్యవహారాలను పరిశీలించేవారు. కీలక ఉద్యోగులతో ఎప్పటికప్పుడు సమీక్షలను నిర్వహించేవారు.

ప్రస్తుతం రామోజీరావు వయసు 88 సంవత్సరాలు. ఆ వయసు రీత్యా ఆయన అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.. నాలుగు రోజుల క్రితం వరకు రామోజీరావు మాములుగానే ఉన్నారు. అయితే అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డారు. అప్పటినుంచి రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. పేరుపొందిన వైద్యులు ఫిలిం సిటీ కి వచ్చి చికిత్స చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. దీంతో ఆయనను హుటాహుటిన శుక్రవారం నానక్ రామ్ గూడ ఆస్పత్రి తరలించారు. దీంతో రామోజీ
సంస్థల్లో పని చేసే ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈనాడు ఉద్యోగులు ప్రార్థనలు, పూజలు చేశారు.. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. చివరికి శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీ కుమారుడు సుమన్, శైలజ, ఇతర కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆస్పత్రి వద్ద ఉన్నారు. రామోజీ మృతదేహాన్ని ఫిలిం సిటీకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.