Mumbai businesswoman: నేటి కాలంలో పురుషులతో సమానంగా వ్యాపారాలలో మహిళలు రాణిస్తున్నారు. భిన్నమైన రంగాలలో కూడా వ్యాపారాలు చేస్తూ సత్తా చూపిస్తున్నారు. కొన్ని సందర్భాలలో పురుషులకు సాధ్యం కానీ వ్యాపారాలలో కూడా మహిళలు అడుగుపెడుతున్నారు. అందులో కూడా లాభాలు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. సహజంగానే వ్యాపారంలో ఎదిగే మహిళలను చూస్తే పురుషులు అసూయ పడుతుంటారు. వ్యాపారంలో తమకు అడ్డుగా ఉన్న మహిళా వ్యాపారుల అడ్డు తొలగించుకోవాలనుకుంటారు. అలా ఓ మహిళా వ్యాపారిని అడ్డు తొలగించుకోవడానికి ప్రైవేట్ కంపెనీ ఎండి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు.
ముంబై మహానగరంలో సమావేశం నిర్వహిస్తున్నట్టు ఫ్రాన్కో ఇండియన్ ఫార్మా ఎండి జాయ్ జాన్ ఫాస్కల్ పోస్ట్ నుంచి ఓ మహిళా వ్యాపారికి సందేశం వెళ్ళింది. ఆ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి వ్యాపారులు వస్తున్నట్లు జాన్ ప్రకటించాడు. వ్యాపారాన్ని సరికొత్త దిశగా అభివృద్ధి చేసుకోవడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని జాన్ వెల్లడించాడు. దీంతో ఆ మహిళ వ్యాపారి ఎన్నో ఆశలతో ఆ సమావేశానికి వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్లి చూడగా ఆమెకు అటువంటి వాతావరణం కనిపించలేదు. ఏదో తేడాగా ఉందని అనుకుంటున్న ఆమెకు ఒక్కసారిగా జాన్ నుంచి ఊహించని పరిణామం ఎదురైంది.
ఆ మహిళా వ్యాపారి తో జాన్ ఒక్కసారిగా అనుచితంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆమెను తుపాకీతో బెదిరించాడు. దుస్తులు తీయించాడు. వివస్త్ర గా మార్చేశాడు. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశాడు. అంతేకాదు ఈ విషయం బయట చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు ఫోటోలు, వీడియోలను బయట పెడతానంటూ భయభ్రాంతులకు గురి చేశాడు. దీంతో ఆ మహిళా వ్యాపారి అక్కడి నుంచి బతుకు జీవుడా అనుకుంటూ వెళ్లిపోయింది.
అయితే ఆ మహిళ ఫోటో ఫ్రేమ్స్, గిఫ్టులు తయారు చేస్తూ ఉంటుంది. తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి కొంతకాలంగా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. పాత పరిచయం నేపథ్యంలో జాన్ నుంచి సందేశం రావడంతో ఆమె అక్కడికి వెళ్ళింది. వాస్తవానికి ఫార్మా ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకోవడానికి ఆమె అక్కడికి వెళ్లింది. కానీ జరిగింది వేరు. బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించారు. జాన్ తో సహా మరో ఐదుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలో జాన్ ఇలాంటి వ్యవహారాలకు పాల్పడ్డాడని.. తనకున్న అర్ధబలంతో పోలీసు కేసులు కాకుండా చూసుకున్నాడని.. కానీ ఇప్పుడు ఈ మహిళ ధైర్యం చేసి పోలీసుల దాకా వెళ్లడంతో అతడి వ్యవహారం బయటపడిందని ముంబై మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.