Uttar Pradesh: కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి, తోడబుట్టిన సోదర సోదరీమణులను కాదనుకొని.. పెళ్లి అనే బంధంతో ఆయిన వాళ్లకు దూరంగా.. అత్తింట్లోకి వస్తుంది స్త్రీ. అలాంటి స్త్రీని చేసుకున్న పురుషుడు ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకోవాలి. భార్యకు గౌరవం ఇచ్చి, భద్రతను కల్పించాలి. కానీ, వాటన్నింటికీ అతడు తిలోదకాలు ఇచ్చాడు. పెళ్లి సమయంలో అగ్నిసాక్షిగా నడిచిన ఏడు అడుగులను మరచి.. ఏకంగా అంతమొందించేందుకు కుట్రకు తెర లేపాడు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ అనే ప్రాంతం ఉంది. అక్కడ ఓ మహిళ తన భర్తతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఈనెల 2న ఆమె భర్త లేని సమయం చూసి ఒక వ్యక్తి (భర్త సోదరుడు) ఇంట్లోకి వచ్చాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన ఘోరాన్ని భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇల్లాలు చెప్పుకుంది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఆమెకు అండగా ఉండాల్సిన ఆ భర్త.. ఎదురు తిరిగాడు. పైగా ఆమెను ఇష్టానుసారంగా కొట్టాడు. ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ మరుసటి రోజు ఆ భర్త, అతడి సోదరుడు ఆమెను చంపేందుకు ప్రయత్నించారు. ఆమె వంట గదిలో వంట చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన భర్త కింద పడేశాడు. ఆమె చాతి మీద కూర్చొని కత్తితో గొంతు కొయ్యబోయాడు. దీనిని అతడి సోదరుడు తన ఫోన్లో వీడియో తీయడం మొదలుపెట్టాడు. అతి కష్టం మీద వారి నుంచి తప్పించుకున్న ఆమె.. తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తుండగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అదే విషయాన్ని కతౌళి కొత్వాలి పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది..
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసినందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. ఆ ఘటన జరిగిన నాటి నుంచి ఆ ఇద్దరు సోదరులు పరారయ్యారు. సెల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. పథకం ప్రకారమే ఆ మహిళ భర్త ముందుగా ఆమెపై తన సోదరుడితో అత్యాచారం చేయించాడు. ఆ తర్వాత ఆమెపై లేనిపోని అబాండాలు వేశాడు. ఆమెను వదిలించుకునేందుకు చివరికి హత్య చేసేందుకు కూడా వెనకాడ లేదు. కాగా, ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. భార్యను అతడు ఎందుకు అంతమొందించాలనుకున్నాడు? దానికి తన సోదరుడితో ఎందుకు అత్యాచారం చేయించాడు? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.