Janasena : జనసేనకు గుడ్ న్యూస్. ఆ పార్టీకి కామన్ సింబల్ గా గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో జనసేన పోటీ చేయని చోట్ల ఇండిపెండెంట్ లకు ఆ గుర్తు కేటాయించే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీలో పొత్తులకు ఇబ్బందికరంగా మారనుంది. ఈ తరుణంలో జనసేన ప్రత్యేక వినతి మేరకు ఎలక్షన్ కమిషన్ కామన్ సింబల్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జనసేన శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
గత ఎన్నికల్లో అన్నిచోట్ల జనసేన పోటీ చేసింది. కానీ ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జనసేన శాశ్వత గుర్తు కోల్పోయింది. ఫ్రీ సింబల్ జాబితాలో ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాస్ గుర్తును ఉంచింది. అయితే గాజు గ్లాసు గుర్తు కోసం ఎలక్షన్ కమిషన్ కు జనసేన విన్నవించుకుంది. ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు ఉన్నందున.. జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తామని.. మిగతా చోట్ల మాత్రం ఇతరులకు కేటాయిస్తామని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అయితే జనసేన కంటే ముందు తాము దరఖాస్తు చేసుకున్నామని మరో పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు ఎలక్షన్ కమిషన్కు నోటీసులు ఇచ్చింది. విచారణ చేపట్టింది. సదరు పార్టీ కంటే జనసేన ముందుగా దరఖాస్తు చేసుకున్న విషయం ఈసీ కోర్టు ఎదుట ఆధారాలతో రుజువు చేసింది. దీంతో గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏకంగా ఫ్రీ సింబల్ జాబితా నుంచి గాజు గ్లాస్ ను తొలగించి.. కామన్ సింబల్ గా కేటాయించడం విశేషం.
పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. వీరందరికీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించనున్నారు. మరి ఇతర నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించే ఛాన్స్ లేదు. ఒకవేళ ఫ్రీ సింబల్ జాబితాను ఎలక్షన్ కమిషన్ కొనసాగిస్తే.. జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గం తప్పించి.. మిగతా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ లను బరిలో దించి.. గాజు గ్లాసు గుర్తును దక్కించుకునేందుకు వైసిపి ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ పరిస్థితి లేకుండా ఎలక్షన్ కమిషన్ కామన్ సింబల్ ను జనసేనకు కేటాయించడంతో వైసిపి ఆలోచనకు ఫుల్ స్టాప్ పడింది. మరోవైపు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ లైట్ గుర్తు కేటాయిస్తూ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.