https://oktelugu.com/

Karnataka : గంటలో హైదరాబాద్ వస్తానని చెప్పాడు.. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్.. చివరికి ఏమైందంటే..

అయితే ఈ హత్య కేసులో వారి ప్రమేయం కూడా ఉందని పోలీసులు అనుమనిస్తున్నారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్టు తెలియడంతో, పోలీసుల అనుమానాలకు బలం చేకూరింది.

Written By:
  • NARESH
  • , Updated On : May 28, 2024 / 03:14 PM IST

    Kuppala-Madhu-Incident

    Follow us on

    Karnataka : “బీదర్లో పని పూర్తయింది. గంటలో హైదరాబాద్ వస్తాను.. నువ్వు స్నానం చేసి తిని పడుకో.. పిల్లలు జాగ్రత్త.. నేను మార్గమధ్యలో ఉన్నాను. డ్రైవింగ్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడమంటే ఇబ్బందిగా ఉంటుంది” అని భర్త చెప్పడంతో ఆ భార్య నమ్మింది. సరిగ్గా గంట తర్వాత ఫోన్ చేస్తే.. తన భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో ఆమె కంగారు పడింది. చివరికి ఆమె భయపడిందే జరిగింది.. ఇంతకీ ఏమైందంటే..

    కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఒక స్థిరాస్తి వ్యాపారి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బీదర్, హైదరాబాదులో సంచలనం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ స్థిరాస్తి వ్యాపారి తలపై పెద్దరాయితో కొట్టి.. ఆ తర్వాత పదునైన కత్తులతో పొడిచి పొడిచి చంపేశారు. ఈ సంఘటన మన్నెకెళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో అక్కడ పోలీసులు కేసు విచారణ సాగిస్తున్నారు.

    హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల కల్పనా సొసైటీలో కుప్పాల మధు (48) అనే స్థిరాస్తి వ్యాపారి, భార్య వెంకటలక్ష్మి, పిల్లలు అఖిల, అలేఖ్యతో కలిసి ఉంటున్నాడు.. స్థిరాస్తి వ్యాపారం తో పాటు ఇతడికి ట్రావెల్స్ వ్యాపారం కూడా ఉంది. ట్రావెల్స్ వ్యాపార నిమిత్తం మధు తరచుగా బీదర్ వెళ్లి వస్తూ ఉంటాడు. పైగా అక్కడ అతనికి స్నేహితులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న వ్యాపారం నిమిత్తం బీదర్ వెళ్లాడు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడు. బీదర్ వెళ్తున్నప్పుడు తనతో పాటు చింతల్ ప్రాంతానికి చెందిన రేణుక ప్రసాద్, వరుణ్, లిఖిత్, సిద్ధార్థ రెడ్డిని తీసుకెళ్లాడు.. మే 25న రాత్రి పది గంటలకు తన భార్యకు ఫోన్ చేశాడు. గంటలో హైదరాబాద్ వస్తున్నట్టు చెప్పాడు. గంట సమయం పూర్తయిన తర్వాత వెంకటలక్ష్మి ఫోన్ చేయగా.. మధు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మళ్లీ మళ్లీ చేసినా అదే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తెల్లవారినా కూడా మధు ఇంటికి రాలేదు.

    బీదర్ జిల్లాలోని మన్నెకెళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మే 25 ఉదయం రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు వద్ద మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కారు నెంబర్ ఆధారంగా.. చనిపోయింది మధు అని గుర్తించారు. ఈ సమాచారాన్ని జీడిమెట్ల పోలీసులకు, మధు భార్యకు చేరవేర్చారు. సంఘటనా స్థలంలో మధు తలపై పెద్ద బండరాయితో కొట్టిన ఆనవాళ్లు.. కత్తులతో పొడిచి చంపిన గుర్తులు కనిపించాయి. మధును హత్య చేసిన అనంతరం, అతడి ఒంటిపై ఆరు లక్షల విలువైన బంగారం, పెద్ద మొత్తంలో ఉన్న నగదు మాయమైంది. వీటి కోసమే నిందితులు మధును హత్య చేసినట్టు తెలుస్తోంది. మధు తను బీదర్ వెళ్తున్నప్పుడు కొంతమందిని తీసుకెళ్లాడు. అయితే ఈ హత్య కేసులో వారి ప్రమేయం కూడా ఉందని పోలీసులు అనుమనిస్తున్నారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్టు తెలియడంతో, పోలీసుల అనుమానాలకు బలం చేకూరింది.