NASA: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు ఈ ఏడాది కలిసి రావడం లేదు. చేస్తున్న ప్రయోగాలు వాయిదా పడుతుండడంతో నాసా అధికారులు కలవరపాటుకు గురవుతున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ అనే రాకెట్ ద్వారా వ్యోమగాములు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉంది. అయితే ఇందులో సాంకేతిక పరమైన సమస్య తలెత్తడంతో.. ఈ అంతరిక్ష యాత్రను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి మంగళవారం ఈ రాకెట్ ఫ్లోరిడా నుంచి నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. రాకెట్ పై భాగంలో హీలియం వాయువు లీకేజీకి గురి కావడంతో ఈ ప్రయోగం వాయిదా పడింది. నాసా సాంకేతిక నిపుణులు గ్యాస్ లీకేజీ పై అధ్యయనం చేస్తున్నారు. మరమ్మతులను కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు.
మే నెల మొదటి వారంలో స్టార్ లైనర్ అంతరిక్షంలోకి బయలుదేరి వెళ్లాల్సి ఉంది. అందులో ప్రయాణించేందుకు అంతరిక్ష యాత్రికులు సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుందనగా..లిఫ్ట్ ఆఫ్ లో సాంకేతిక సమస్య ఎదురయింది. దీంతో ఈ ప్రయోగాన్ని మే 21కి వాయిదా వేస్తున్నట్టు నాసా తెలిపింది. అయితే మరొకసారి హీలియం గ్యాస్ లీకేజీ కావడంతో మే 25వ తేదీకి ప్రయోగాన్ని మరోసారి నాసా వాయిదా వేసింది. ఇప్పుడు గ్యాస్ లీకేజీ కావడంతో మరమ్మతులు చేసేందుకు మరోసారి వాయిదా వేశారు. ఇప్పుడు తగిన సమయం లభించిందని నాసా ప్రకటించింది.
రాకెట్ లో ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్ల.. అందులో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్న వ్యోమగాములు బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ టెక్సాస్ లోని హుస్టన్ నగరంలో ని ఓ హోటల్లో బస చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఈ అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. ఇది బోయింగ్ సంస్థకు తలనొప్పిగా మారింది. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న బోయింగ్ సంస్థ.. ఈ అంతరిక్ష యాత్రను సవాల్ గా తీసుకుంది.. విజయవంతం చేయాలనే సంకల్పంతో ముందు అడుగులు వేస్తోంది.
ప్రత్యేకమైన రాకెట్ లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు వ్యోమగాములను తీసుకెళ్లి, ఆ మిషన్ పూర్తయిన తర్వాత భూమికి సురక్షితంగా తిరిగి చేరుకోవడం ఇప్పటికే ఒకసారి విజయవంతంగా పూర్తయింది. రెండవసారి వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్తున్నారు.. వీరిని నాసా బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. దీంతో అందరి కళ్లు స్టార్ లైనర్ పైనే ఉన్నాయి.. నాసా కాకుండా, అంతకుముందు 2020లో ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ లోని డ్రాగన్ క్యాప్సుల్ వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్లి సురక్షితంగా వచ్చారు. అంతకుముందు వరకు రష్యాకు చెందిన రాకెట్ల లోనే వ్యోమగాములు స్పేస్ స్టేషన్ కు వెళ్లేవారు.. సురక్షితంగా భూమికి తిరిగి వస్తుండేవారు. ఆ రికార్డును తొలిసారిగా స్పేస్ ఎక్స్ బద్దలు కొట్టింది.. ప్రస్తుతం బోయింగ్ సంస్థ నుంచి స్టార్ లైనర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లేందుకు రెడీ అవుతోంది. కాకపోతే వరుస అడ్డంకులు ఆ మిషన్ కు ఇబ్బంది కలిగిస్తున్నాయి.