Suryapet: ఈ సృష్టిలో ఎటువంటి కల్తి లేనిది, బదులు కోరనిది, ఏమీ ఆశించనిది.. ఏదైనా ఉందంటే అది తల్లి ప్రేమ మాత్రమే. తల్లి తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. నిద్రలేని రాత్రులు గడుపుతుంది. తనకు తిండి లేకపోయినా పిల్లలకు మూడు పూటలా పెడుతుంది. తండ్రి ఇతర వ్యవహారాలు చూసుకుంటే.. తల్లి కుటుంబ భారాన్ని మొత్తం వస్తుంది. అందుకే తల్లి ఉంటే తరం నిలుస్తుంది అంటారు. అదే తల్లి కాలం చేస్తే తరం వెళ్ళిపోతుంది అంటారు. అంతటి గొప్పదైన తల్లిని ఓ కొడుకు కాదనుకున్నాడు. కన్ను మూసిన తల్లికి తలకొరివి పెట్టేందుకు డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ దారుణం సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది..
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందుల వారి గూడేనికి చెందిన వేం వెంకటరెడ్డి, లక్ష్మమ్మ (80) అనే దంపతులున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ సంతానంలో చిన్న కుమారుడు గతంలోనే కన్నుమూశాడు. వెంకట్ రెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం కాలం చేశాడు. లక్ష్మమ్మ ఐదు సంవత్సరాలుగా నేరేడుచర్లలోని తన చిన్న కుమార్తె వద్ద ఉంటోంది. ఇటీవల ఆమె కాలుజారి కింద పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా మారడం, వయోభారం వల్ల ఇంటికి తీసుకెళ్లాలని ఆసుపత్రి వైద్యులు సూచించారు. ఆక్సిజన్ ఉంటేనే ఆమె బతుకుతుందని సూచించారు. దీంతో చిన్న కుమార్తె, ఆమె భర్త లక్ష్మమ్మను అంబులెన్స్ లో ఇంటికి తీసుకువచ్చారు. ఆమెకు ఆక్సిజన్ అందించడం ప్రారంభించారు.
తల్లి చావు బతుకుల మధ్య ఉన్నప్పటికీ.. ఉన్న ఒక్క కుమారుడు ఆ విషయాన్ని మరిచిపోయాడు. తన చిన్న సోదరి ఇంటి వద్దకు చేరుకొని.. పంచాయితీ పెట్టించాడు. పెద్దమనుషుల సమక్షంలో నానా గొడవ చేశాడు. తల్లిని తనతో తీసుకెళ్తానని అన్నాడు. ఇందుకు మిగతా కుమార్తెలు అడ్డు చెప్పారు. ఆస్తి పంపకాలు తేలే వరకు అమ్మను తీసుకెళ్లబోనివ్వమని స్పష్టం చేశారు. ఈ గొడవ జరుగుతుండగానే రాత్రి 11 గంటలకు లక్ష్మమ్మ చనిపోయింది. దీంతో లక్ష్మమ్మ మృతదేహాన్ని ఆమె కుమారుడు కందుల వారి గూడెం తీసుకెళ్లాడు. అయినప్పటికీ వారి మధ్య పంచాయితీ పరిష్కారం కాలేదు. లక్ష్మమ్మ వద్ద 21 లక్షలు, ఒంటిపై 20 తులాల బంగారం ఉంది. ఇప్పటివరకు తల్లి వైద్య ఖర్చులు మొత్తం భరించిన చిన్న కుమార్తెకు అందులో నుంచి ఆరు లక్షలు ఇచ్చారు. మిగతా 15 లక్షలు కుమారుడు తీసుకున్నాడు. ఇక ఒంటిపై ఉన్న ఆభరణాలను కుమార్తెలను ముగ్గురు పంచుకున్నారు. ఇదంతా జరిగిన తర్వాత చివరి నిమిషంలో కుమారుడు అనుకోని ట్విస్ట్ ఇచ్చాడు. అంత్యక్రియల ఖర్చు మొత్తం భరించలేనని.. తనకు డబ్బులు ఇస్తేనే తలకొరివి పెడతానని కొత్త పంచాయితీ పెట్టాడు. ఆ ఊరి గ్రామస్తులు చెప్పినప్పటికీ అతడు తగ్గలేదు. చివరికి సోదరీమణులు చెప్పినప్పటికీ అతడు బెట్టు విడలేదు. దీంతో కుమార్తెలు లక్ష్మమ్మ మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టారు. ఈ గొడవ ఎప్పుడు తీరుతుందోనని.. గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాగా, ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులకు డబ్బు మీద పెరిగిపోయిన వ్యామోహాన్ని సూచిస్తోంది.