https://oktelugu.com/

Dhar Gang Robbery : దేవతలకు పూజ… పగలు రెక్కి.. రాత్రి దొంగతనం.. ఇంతకీ ఈ దొంగల కథ ఏంటో తెలుసా?

"బంగారం, వెండి దొరకాలి. అత్యంత విలువైన వస్తువులు మాకు లభించాలి. దేవతామూర్తులారా మేము చేస్తున్న ఈ చోరీలలో భారీగా విలువైన వస్తువులు లభించేలా చూడండి" అంటూ మొక్కుతారు. ఆ తర్వాత దొంగతనానికి బయలుదేరుతారు. ఇంతకీ ఈ గ్యాంగ్ ఎక్కడిది? వారి పేరేంటి? వారు దొంగతనాలు ఎలా చేస్తారు? వీటిపై ఆసక్తికర కథనం ఇది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 9, 2024 / 09:46 PM IST

    Dhar Gang Robbery

    Follow us on

    Dhar Gang Robbery : మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధార్ అనే అంతర్రాష్ట్ర దొంగల ముఠా.. చాలా విచిత్రంగా చోరీలకు పాల్పడుతుంది. ఈ ముఠా సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాకు చెందిన కరణ్ మనోహర్ బాబర్, ప్యార్ సింగ్ బావుల, దేబ్రా బావుల గతంలో వివిధ నేరాలు చేసి జైలుకు వెళ్లి వచ్చారు. వీరిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కో ముఠాలో ఆరుగురు సభ్యులు ఉంటారు. అయితే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ దొంగలు తస్కరించిన వస్తువులను కొనుగోలు చేసే రిసీవర్లు రోహిత్ సోనీ, గౌరవ్ పరారీలో ఉన్నారు. ఈ ముఠాలో నేరస్తులు మొత్తం గతంలో కేసులు ఉన్నవారే. వీరంతా కూడా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో నేరాలకు పాల్పడ్డారు.

    దొంగతనానికి వెళ్లే ముందు

    దొంగతనానికి వెళ్లే ముందు వీరంతా తమ కుల దేవతలకు పూజలు చేస్తారు. ఆ తర్వాత నేరాలు చేస్తారు. పగటిపూట రెక్కీ నిర్వహిస్తారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని.. అర్ధరాత్రి అనంతరం నేరాలకు పాల్పడతారు. వారు అంచనా వేసుకున్న మేరకు సొత్తు లభించగానే.. నేరుగా స్వగ్రామానికి వెళ్లిపోతారు. స్వగ్రామానికి వెళ్లడానికి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తారు. ఇక ఈ ముఠా సభ్యులు 2020 నుంచి 2024 వరకు హైదరాబాదులోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 36 దొంగతనాలు చేశారు. బంగారం, వెండి, లక్షల్లో నగదును దొంగిలించారు. అయితే ఈ దొంగిలించిన సొమ్మును వారి ముఠాలోనే కొంతమంది వ్యక్తులకు అప్పచెబుతారు. వారు రెండో కంటికి తెలియకుండా విక్రయిస్తారు. వీరు దొంగిలించిన సొమ్ములో ఏదైనా ఆభరణం కంటికి ఇంపుగా కనిపిస్తే వారి వద్దే ఉంచుకుంటారు. వెండిని దొంగిలించగానే వెంటనే విక్రయించేందుకు ఏర్పాటు చేస్తారు. వీరు దొంగిలించిన బంగారాన్ని, వెండిని ఎక్కడ విక్రయించారనేది తెలియడం లేదు.. ఈ దొంగల ముఠాలోని సభ్యులకు వారి సొంత ప్రాంతాలలో ఖరీదైన బంగ్లాలో, నివాస స్థలాలు ఉన్నాయని సమాచారం.

    పైకి పేదవాళ్లుగా నటిస్తూ..

    పైకి పేదవాళ్లుగా నటిస్తూ.. పగటిపూట రెక్కీ నిర్వహిస్తారు. సీసీ కెమెరాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పొరపాటున కూడా ఒక్క ఆధారాన్ని కూడా జార విడువరు. అత్యంత జాగ్రత్తగా దొంగతనం చేస్తారు. ఆ తర్వాత చోరీ చేసిన సొత్తును మొత్తం రెండవ కంటికి తెలియకుండా తరలిస్తారు. ఆ తర్వాత ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి.. నంబర్ ప్లేట్లు తొలగించి.. వాటిపై స్వగ్రామాలకు వెళ్తారు. అయితే దొంగలించిన ఆ ద్విచక్ర వాహనాలను బైక్ మెకానిక్ లకు విక్రయిస్తుంటారు.. ఇలా కూడా సొమ్ము చేసుకుంటారు. మొత్తంగా అత్యంత తెలివిగా దొంగతనాలు చేస్తూ.. దండిగా వెనకేసుకుంటారు. అయితే దొంగతనం చేసే సక్రమంలో పొరపాటున కూడా హత్యలు, ఇతర దుర్మార్గాలకు పాల్పడరు. హత్యలు చేయరంటే వీళ్ళు మంచివాళ్లు అని భ్రమ పడొద్దు.. ఎందుకంటే హత్యలు చేయడం వాళ్ళ కుల దేవతలకు నచ్చదు. అందువల్లే వారు కేవలం దొంగతనాలు మాత్రమే చేస్తారు.