Black magic : మంత్రాలకు చింతకాయలు రాలవు. కానీ కొంతమంది దీనిని నమ్ముతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు విపరీతమైన అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలోనూ కొంతమంది మూఢనమ్మకాలతో ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. చేతబడి, బాణామతి వంటి వాటిని నమ్ముతూ పైశాచిక చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని రకాలుగా కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ.. శాస్త్రవేత్తలు ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినప్పటికీ అలాంటి వారు మారడం లేదు. పైగా ఎదుటివారి ప్రాణాలు తీయడానికి వెనుకాడటం లేదు. తాజాగా చత్తీస్ గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. క్షుద్ర పూజలు చేస్తున్నారని, చేతబడి కి కారణమవుతున్నారని ఆరోపిస్తూ ముగ్గురు మహిళలను, ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు అత్యంత పైశాచికంగా కొట్టి చంపారు. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్తాల్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. మృతులను మౌసం కన్నా, బిరి, బుచ్చా, అర్జో, లచ్చి, యశ్గా గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అనంతరం పోలీసు ఉన్నతాధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ప్రాంతం నక్సల్స్ ఆయువు పట్టు లాంటిది కావడంతో పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఈ ప్రాంతానికి చేరుకున్నారు. గ్రామస్తులు మొత్తం ప్రతిఘటించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. కేంద్ర బలగాల సహాయం కూడా తీసుకున్నారు..
చత్తీస్ గడ్ రాష్ట్రంలోని బలోడా బజార్ జిల్లా నుంచి సెప్టెంబర్ 13న ఇద్దరు దంపతులను, మరో ఇద్దరు మహిళలను గ్రామస్తులు తీసుకొచ్చారు. చేతికి అందిన వస్తువుతో ఆ ఐదుగురిని కొట్టారు. గ్రామస్తులు మొత్తం వారందరినీ దారుణంగా హింసించారు. అయితే ఈ ఘటనలో ఒక చిన్నారి కూడా దుర్మరణం చెందింది. మృతులు మొత్తం ఒకే కుటుంబానికి చెందినవారు. గొడ్డళ్లు, సుత్తెలు, అదనైన ఆయుధాలతో వారందరినీ కొట్టి చంపారు. చేతబడి అనుమానం వల్లే వారిని గ్రామస్తులు ఇలా చంపేశారని తెలుస్తోంది. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ చిద్రమైన మృతదేహాలను చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణం కస్డోల్ చార్ చెడ్ గ్రామంలో జరిగింది. అయితే అదే కుటుంబాన్ని చెందిన ఓ వృద్ధురాలు మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఇక ఇదే తరహా సంఘటన భాతపర జిల్లాలోనూ చోటుచేసుకుంది. చేతబడి నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని అత్యంత దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. వారిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు.