Donald Trump : ట్రంప్‌పై హత్యాయత్నం.. అనుమానం వ్యక్తం చేసిన కీలక మద్దతుదారుడు.. సంచలనంగా మారిన ట్వీట్‌!

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎన్నికల బరిలోఉన్న రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై మళ్లీ ఆదివారం హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అతని గోల్ఫ్‌కోర్స్‌ సమీపంలో ఓ దుండగుడు ట్రంప్‌ లక్షంగా కాల్పులు జరిపినట్లు అమెరికా మీడియా తెలిపింది.

Written By: Raj Shekar, Updated On : September 16, 2024 10:22 pm

Donald Trump

Follow us on

Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 50 రోజులే సమయం ఉంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హామీలు గుప్పిస్తున్నారు. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇదిలా ఉంటే.. రేసులో ముందు వరుసలో ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య ఇటీవల డిబేట్‌ కూడా జరిగింది. మరోవైపు సర్వే సంస్థలు గెలుపు అవకాశాలను అంచనా వేస్తూ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. పోటీ కమలా, ట్రంప్‌ మధ్యనే హోరాహోరీగా సాగుతుందని పేర్కొంటున్నాయి. దీంతో ఇద్దరు అభ్యర్థులు గెలుపు కోసం కష్టపడుతున్నారు. ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మరోమారు ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిందన్న వార్తలు కలకలం రేపాయి.

గోల్ఫ్‌ కోర్స్‌లో ఘటన..
డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లోని తన గోల్ఫ్‌ కోర్సులో గోల్ఫ్‌ ఆడుతున్న క్రమంలో సమీపంలో తుపాకీ శబ్దాలు వినిపించాయని అమెరికా మీడియా తెలిపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమీపంలో తనిఖీలు చేయగా ఓ అనుమానాస్పద వ్యక్తి కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని ఏకే 47 తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ట్రంప్‌ స్పందించారు. తాను క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. హత్యాయత్నం ఘటనను అధ్యక్షుడు బైడెన్, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ ఖండించారు.

మస్క్‌ అనుమానం..
ఇదిలా ఉంటే.. ట్రంప్‌ మద్దతురాదు.. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌మస్క్‌ మాత్రం ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనపై అనుమానం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో చేసిన ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెరికాలో దుమారం రేపుతోంది. ‘ట్రంప్‌ను వాళ్లు ఎందుకు చంపాలనుకుంటున్నారు.’ అని ఓ వ్యక్తి ట్వీట్‌ చేశాడు. దీనికి మస్క్‌ స్పందించాడు. ౖ‘బెడెన్, కమలా హారిస్‌ను చంపాలని ఎవరూ అనుకోవడం లేదు.. ట్రంప్‌పైనే హత్యాయత్నం జరుగుతోంది’ అని ట్వీట్‌ చేశారు. అనుమానాలకు కొనసాగింపుగా మరిన్ని ట్వీట్లు చేశారు. తాను లేవనెత్తిన అంశాన్ని ఎవరూ ప్రస్తావించడం లేదు అని ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో ‘ట్రంప్‌ వ్యవస్థను భయపెడుతున్నారు. ఆ వ్యవస్థ ఆయనను హత్య చేయాలని చూస్తోంది.. ఆ వ్యవస్థ బైడెన్, కమలా హారిస్‌’ అని మరో వ్యక్తి ట్వీట్‌ చేశాడు. దానికి మస్క్‌ నూటికి నూరు శాతం అంటూ రిప్లయ్‌ ఇచ్చారు. ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌పై డెమోక్రటిక్‌ మద్దతుదారులతోపాటు, ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.