Cyber Crime: ప్రస్తుతం మన జీవితం మొత్తం స్మార్ట్ఫోన్ చుట్టూ తిరుగుతోంది. వ్యాపార లావాదేవీలు నుంచి మొదలు పెడితే ఎదుటి వ్యక్తితో మాట్లాడే మాటల వరకు ప్రతిదీ కూడా స్మార్ట్ఫోన్ ఆధారంగానే సాగుతున్నాయి. సాంకేతికత కొత్త కొత్త రూపులు దాల్చిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లు కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి. కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ స్మార్ట్ఫోన్ ఆధారంగా సాగే ఆర్థిక కార్యకలాపాలలో కొంతకాలంగా సైబర్ నేరగాళ్లు మాటువేశారు. లొసుగులను ఆసరాగా తీసుకొని అడ్డగోలుగా మోసాలు చేస్తున్నారు. చివరికి చూస్తుండగానే మన ఖాతాను లూటీ చేస్తున్నారు.
Also Read: రవి అస్తమించని బ్రిటీష్ రాజ్యంలో పరిస్థితి తలకిందులు ఎందుకైంది?
సైబర్ నేరగాళ్ల దుర్మార్గాలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. సైబర్ నేరాలను అడుక్కోవడానికి ఏకంగా ప్రత్యేకమైన పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇంత జరుగుతున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు ఏమాత్రం ఆగడం లేదు. పైగా కొత్త కొత్త విధానాలలో నేరాలకు పాల్పడుతున్నారు. లింకులు.. ప్రమాదకరమైన ఫైల్స్ పంపి.. యూజర్ల బ్యాంకు ఖాతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత లావాదేవీలు కూడా వారే చేస్తూ దండిగా దండుకుంటున్నారు. ఈ తరహా ఫిర్యాదులు ఇటీవల కాలంలో పెరిగిపోయిన నేపథ్యంలో సైబర్ పోలీసు విభాగాన్ని ప్రభుత్వం బలోపేతం చేసింది.
పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో.. అది కాస్త సత్ఫలితాలనుస్తోంది. అయితే తమ ఎత్తులకు పోలీసులు పై ఎత్తులు వేస్తూ ఉండడంతో సైబర్ మోసగాళ్లు మరో కొత్త పన్నాగానికి దారి తీశారు. ఇండియా పోస్ట్ పేరుతో ఫేక్ సందేశాలు పంపుతున్నారు. మీ పార్సిల్ వచ్చేసింది. అడ్రస్ సరిగా లేకపోవడంతో డెలివరీ ఇవ్వడం సాధించడం లేదు. మీకు ఇచ్చిన లింకు ఓపెన్ చూసి అడ్రస్ అప్డేట్ చేయండి. లేకుంటే పార్సల్ తిరిగి వెళ్ళిపోతుంది అని సందేశాలు పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఫేక్ అని సైబర్ అధికారులు చెబుతున్నారు. వారు ఇచ్చిన లింకు ఓపెన్ చేస్తే.. అందులో మనం వివరాలు ఎంట్రీ చేస్తే.. సైబర్ నేరగాళ్ల చేతిలోకి మన జాతకం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అన్ని వివరాలు తెలుసుకొని నిండా ముంచుతారు. అందువల్ల ఇటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని.. అటువంటి సందేశాలను ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు.