Nizamabad: నకిలీ పత్రాలు సృష్టించి.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఎసరు.. ఎక్కడ జరిగిందంటే..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శంభుని గుడి వెనకాల కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ కార్యకలాపాల కోసం 75 గజాల స్థలాన్ని దశాబ్దాల క్రితం కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ ప్రాంతం అంతగా అభివృద్ధి చెందలేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 29, 2024 8:15 am

Nizamabad

Follow us on

Nizamabad: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది.. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ ఐదేళ్లు కాకుండా, వచ్చే ఐదేళ్లు కూడా తామే అధికారంలో ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు.. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. కానీ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. దానికి కారణం లేకపోలేదు.. ఇంతకీ ఏం జరిగిందంటే.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శంభుని గుడి వెనకాల కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ కార్యకలాపాల కోసం 75 గజాల స్థలాన్ని దశాబ్దాల క్రితం కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ ప్రాంతం అంతగా అభివృద్ధి చెందలేదు. కేవలం అక్కడ గుడి, కొన్ని వ్యాపార సముదాయాలు మాత్రమే ఉన్నాయి. స్థలం ఉన్నప్పటికీ పట్టణ కార్యాలయాన్ని అక్కడ నిర్మించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ.. అప్పటి నాయకులు పార్టీ కార్యాలయ నిర్మాణం పై ఆసక్తి చూపించలేదు. నిజామాబాద్ నగరం రోజురోజుకు అభివృద్ధి చెందడంతో ఆ స్థలం విలువ పెరిగింది. ఆ ప్రాంతంలో ఇండ్లు, ఇతర సముదాయాలు నిర్మితమయ్యాయి. దీంతో ఆ స్థలంలో కొంతమంది చిరు వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. ఇందుకు గానూ పార్టీ కార్యాలయానికి ఏం ప్రతినెల అద్దె చెల్లిస్తున్నారు.

ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదే అదునుగా కొంతమంది శంభుని గుడి వెనకాల కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ కార్యకలాపాల కోసం కొనుగోలు చేసిన 75 గజాల స్థలంపై కన్నేశారు. నకిలీ పత్రాలు సృష్టించి మే 24న పాషా, రిజ్వాన బేగం అనే వ్యక్తులు మహమ్మద్ మజీద్ అనే వ్యక్తికి విక్రయించినట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు.. ఆ తర్వాత ఆ స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయాన్ని ఆ ప్రైవేట్ వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో వారు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగు చూసింది. అయితే ఈ వ్యవహారం బయటికి తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతర్గతంగా విచారణ మొదలుపెట్టారు. పోలీసులు కూడా ఆ వ్యక్తులను పిలిపించి ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ రిజిస్ట్రేషన్ కు సంబంధించి సమర్పించిన దస్త్రాలు నకిలీవని తేల్చారు. అయితే ఈ వ్యవహారంలో పాషా, రిజ్వానా బేగం, మహమ్మద్ మజీద్ మాత్రమే ఉన్నారా?, వీరికి ఎవరు సహకరించారు?, సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇలా ఎసరు పెట్టారు? అనే కోణాలలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం స్థానికంగా సంచలనం సృష్టించింది. సాక్షాత్తు అధికార పార్టీ స్థలానికే భద్రత లేకపోతే.. ఇక మిగతా వారి పరిస్థితి ఏంటని భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శిస్తున్నారు.