Ind W Vs SA W Test: ఒక్క మ్యాచ్.. డబుల్ సెంచరీతో షెఫాలీ వీరవిహారం.. 22 ఏళ్ల రికార్డు బద్దలు

భారత్ తరఫున డబుల్ సెంచరీ కొట్టిన రెండవ మహిళా క్రికెటర్ గా వర్మ రికార్డు నమోదు చేసింది. 22 సంవత్సరాల క్రితం టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 407 బంతుల్లో 214 పరుగులు చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 29, 2024 8:04 am

Ind W Vs SA W Test

Follow us on

Ind W Vs SA W Test: మహిళా క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీలు నమోదు కావడం అత్యంత అరుదు. కానీ ఆ ఘనతను టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ తన ఖాతాలో నమోదు చేసుకుంది. మహిళా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా ద్వి శతకం బాదిన తొలి క్రీడాకారిణి గా రికార్డు సృష్టించింది. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో ప్రారంభమైన ఏకైక టెస్టులో వర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో విరుచుకుపడింది. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించింది.

197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్స్ లతో 205 పరుగులు చేసి, సరికొత్త రికార్డులను సృష్టించింది. వండే తరహాలో బ్యాటింగ్ చేసి 194 బంతుల్లోనే డబల్ సెంచరీ కొట్టేసింది.. ఈ రికార్డు ఇప్పటివరకు ఆస్ట్రేలియా క్రీడాకారిణి అన్నాబెల్ సదర్ ల్యాండ్ పేరు మీద ఉండేది. అయితే ఆమె రికార్డును వర్మ అధిగమించింది. ఈ ఏడాది ప్రారంభంలో సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సదర్ ల్యాండ్ 248 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టింది. మహిళా టెస్ట్ క్రికెట్ చరిత్రలో సదర్ ల్యాండ్ చేసిన డబుల్ సెంచరీ వేగవంతమైనదిగా ఉండేది. అయితే వర్మ ఆ రికార్డును బద్దలు కొట్టింది.

భారత్ తరఫున డబుల్ సెంచరీ కొట్టిన రెండవ మహిళా క్రికెటర్ గా వర్మ రికార్డు నమోదు చేసింది. 22 సంవత్సరాల క్రితం టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 407 బంతుల్లో 214 పరుగులు చేసింది. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత 20 ఏళ్ల వర్మ భారత్ తరఫున మరో డబుల్ సెంచరీ కొట్టేసింది.

షెపాలీ వర్మ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఆమె శైలి ఒకప్పటి టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను గుర్తుకు తెచ్చింది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా బౌలర్ డెల్మీ టక్కర్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్స్ లు కొట్టి డబుల్ సెంచరీ చేసింది. వాస్తవానికి ఆమెను సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఔట్ చేయలేకపోయారు. కానీ జెమీమా రోడ్రిగ్స్ తో సమన్వయ లోపంతో వర్మ రనౌట్
అయింది. ఫలితంగా 205 పరుగుల భారీ ఇన్నింగ్స్ ముగిసింది.

వర్మ డబల్ సెంచరీకి స్మృతి మందాన (149) సెంచరీ తోడు కావడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 98 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 525 పరుగులు చేసింది. తొలిరోజే 500 పరుగులు చేసిన జట్టుగా భారత్ అరుదైన ఘనతను సాధించింది. ప్రస్తుతం క్రీజ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ (42), రిచా ఘోష్ (43) ఉన్నారు.. ఇక తొలి వికెట్ కు షెఫాలి వర్మ, స్మృతి మందాన 292 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.