https://oktelugu.com/

App Loan : మాయదారి యాప్ లోన్.. బీటెక్ విద్యార్థి ప్రాణం తీసింది..

రుణం చెల్లించాలని యాప్ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వేధిస్తున్నారు. ఇటీవల ఈ తరహా వేధింపులతోనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : May 28, 2024 / 09:45 PM IST

    App loan

    Follow us on

    app loan ఆన్ లైన్ రుణాలు మంచివి కాదు.. వాటి మాయలో చిక్కుకొని బాధపడొద్దు.. ప్రాణాలు తీసుకోవద్దని పోలీసులు చెబుతున్నా.. మీడియాలో వార్తలు వస్తున్నా.. కొంతమంది ఇప్పటికీ గుడ్డిగానే నమ్ముతున్నారు. యాప్ లలో రుణాలు తీసుకొని నిండా మునుగుతున్నారు. యాప్ నిర్వాహకులు పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. అలా ఓ బీటెక్ విద్యార్థి యాప్ నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇటీవల ఈ తరహా లోనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా ఓ బీటెక్ విద్యార్థి తనువు చాలించాడు.

    ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వంశీ అనే యువకుడు విజయవాడకు సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అతడు ఆన్ లైన్ యాప్ లో రుణం తీసుకున్నాడు.. రుణం ఇచ్చిన దగ్గర నుంచి యాప్ నిర్వాహకులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీంతో వంశీ వారి వేధింపులు భరించలేక కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరికొద్ది రోజుల్లో అతడి బీటెక్ పూర్తవుతుంది. చేతికి అంది వస్తాడనుకున్న కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో.. అతడి తల్లిదండ్రులు గుండెల విసేలా రోదిస్తున్నారు.

    వంశీ చదువులో ఎప్పుడూ ముందుంటాడు. అతడికి ఎటువంటి అలవాట్లు కూడా లేవు.. అనుకోకుండా అన్ లైన్ రుణ యాప్ సంస్థల వాళ్లకు చిక్కాడు. అధిక వడ్డీకి అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పును ఏం చేశాడనేది తమకు చెప్పలేదని తల్లిదండ్రులు అంటున్నారు. వంశీ చదువులో చురుకు కావడంతో.. మరో రెండు నెలల్లో జరిగే ప్రాంగణ నియామకాలలో ఉద్యోగం సంపాదిస్తాడని అనుకున్నామని.. కానీ ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదని మృతుడి తల్లిదండ్రులు వాపోతున్నారు.

    వంశీ కుటుంబం విజయవాడలోని గిరిపురం లో ఉంటోంది. ఇతడు వడ్డేశ్వరంలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఇతడి తండ్రి తాపీ పని చేస్తూ.. వంశీ తో పాటు అతడి తమ్ముడిని కూడా చదివిస్తున్నాడు. వంశి చదువులో చురుకు కాబట్టి ఉచితంగానే ఇంజనీరింగ్ సీటు సాధించాడు. నాలుగేళ్లపాటు కష్టపడి చదివిన వంశీ.. మెరుగైన మార్కులు సాధించాడు. మరికొద్ది రోజుల్లో ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడతాడనుకుంటున్న సమయంలో ఆన్ లైన్ రుణ సంస్థల ఊబిలో చిక్కుకున్నాడు. అతడు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినప్పటికీ.. అధిక వడ్డీల కోసం యాప్ నిర్వాహకులు ఒత్తిడి తీసుకొచ్చారు.

    అప్పు విషయం ఇంట్లో చెప్పలేక.. ఈనెల 25న ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లాడు. కృష్ణ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. చనిపోవడానికి ముందు వంశీ తన తల్లిదండ్రులకు “అమ్మానాన్న నన్ను క్షమించండి.. ” అంటూ సందేశం పంపాడు. వారు భయపడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. రెండు రోజులపాటు వెతికారు. కృష్ణ నది ఒడ్డున వంశీ బైక్ కనిపించినప్పటికీ.. అతడి జాడ తెలియ రాలేదు. ఇక సోమవారం ఉదయం కృష్ణా నదిలో గుర్తుతెలియని మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం రావడంతో .. వారు అక్కడికి వెళ్లి పరిశీలించారు .. ఆ మృతదేహం వంశీదని తల్లిదండ్రులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అయితే వంశీ క్రికెట్ బెట్టింగ్ కోసమే రుణం తీసుకున్నాడని తెలుస్తోంది.. అలాంటి యాప్ రుణ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వంశీ చనిపోయినప్పటికీ.. రుణం చెల్లించాలని యాప్ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వేధిస్తున్నారు. ఇటీవల ఈ తరహా వేధింపులతోనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.