https://oktelugu.com/

Penuganchiprolu : పెళ్లయిన పుష్కరం తర్వాత పుట్టాడు.. వీధి కుక్కలు చేసిన పనికి పాపం ఆ బాలుడు.. ఆ దంపతులకు తీరని శోకం!

ఆ దంపతులకు పెళ్లయి పన్నెండు సంవత్సరాలు.. అన్ని సంవత్సరాలుగా వారికి సంతానం లేదు. వెళ్ళని ఆసుపత్రి అంటూ లేదు. మొక్కని దేవుడు అంటూ లేడు. చివరికి పుష్కరం తర్వాత వారికి సంతానం కలిగింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 12, 2024 / 08:25 PM IST

    nTR district

    Follow us on

    Penuganchiprolu : 12 సంవత్సరాల ఎదురుచూపు తర్వాత కొడుకు పుట్టడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లేకలేక కొడుకు పుట్టడంతో ఆ దంపతులు ఆ చిన్నారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇన్నాళ్లపాటు అనుభవించిన బాధను అతడి ఎదుగుదల చూస్తూ మర్చిపోతున్నారు.. కానీ ఇంతలోనే వారి ఆనందం ఆవిరైంది. వారి సంతోషం కాలగర్భంలో కలిసిపోయింది. వీధి కుక్కలు రాసిన మరణ శాసనం వల్ల వారి కుమారుడు చనిపోయాడు. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు ప్రాంతంలో తుఫాన్ కాలనీలో బాలతోటి గోపాలరావు, నాగమణి దంపతులకు 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అన్ని సంవత్సరాలు పాటు ఎదురుచూసినప్పటికీ వారికి సంతానం కలగలేదు. చివరికి పుష్కరం తర్వాత నాగమణి గర్భవతి అయింది. దీంతో గోపాలరావు ఆనందానికి అవధులు లేవు. గర్భవతి అయిన తన భార్యను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. చివరికి నాగమణి పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ మగ పిల్లాడికి ప్రేమ్ కుమార్ అని పేరు పెట్టారు.. ప్రస్తుతం అతని వయసు రెండు సంవత్సరాలు. ఆ చిన్నారికి స్నానం చేయించడానికి నాగమణి ఇంటి బయటకు తీసుకెళ్ళింది. స్నానం పూర్తి చేయించి కుమారుడిని బయటికి తీసుకెళ్ళింది. ఏదో పని ఉండగా బిడ్డను అక్కడే ఉంచి.. ఇంట్లోకి వెళ్ళింది. ఈ క్రమంలోనే వీధి కుక్కలు ఒక్కసారిగా నాగమణి ఇంటి మీద పడ్డాయి. ఆరు బయట ఉన్న ప్రేమ్ కుమార్ ను నోట కరుచుకొన్నాయి. అలా బయటికి లాక్కెళ్ళిపోయాయి.

    ఆసుపత్రికి తీసుకెళ్లగా..

    వీధి కుక్కలు ప్రేమ్ కుమార్ ను విపరీతంగా కరిచాయి. స్థానికుడు ఆ కుక్కలను చూసి కర్రతో కొట్టాడు. దీంతో ఆ బాలుడిని అక్కడే వదిలేసి పారిపోయాయి. దీంతో నాగమణి కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వివాహం జరిగిన 12 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుడు ఇలా వీధి కుక్కల దాడిలో చనిపోవడంతో నాగమణి, గోపాలరావు దంపతులు రోదిస్తున్న తీరు కంటనీరు పెట్టిస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో కుక్కల బెడద పెరిగిపోయింది. కుక్కలు ప్రజలపై విపరీతంగా దాడులు చేస్తున్నాయి. చేతిలో సంచి తో బయటికి వెళ్తే చాలు వెంటపడి మరీ కరుస్తున్నాయి. దీంతో బయటికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. పెరిగిన కుక్కల బెడదను నివారించాలని ప్రజలు పురపాలక శాఖ అధికారులను కోరుతున్నారు. “కుక్కల బెడద ఎక్కువైంది. బయటికి వెళ్లాలంటే భయం కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పురపాలక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. లేకుంటే బతికే పరిస్థితి లేదు. కుక్కలు ఇష్టానుసారంగా దాడులు చేయడం వల్ల తీవ్రంగా గాయాలు అవుతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి దాపురిస్తోందని” ప్రజలు వాపోతున్నారు.