Hyderabad : పీకలదాకా మద్యం తాగారు.. స్నేహితుడని చూడకుండా దారుణానికి పాల్పడ్డారు..

పీకలదాకా మద్యం తాగారు. ఆ మత్తులో ఏం చేస్తున్నారో వారికి అర్థం కాలేదు. ఆ మైకం లోనే వారు దారుణానికి పాల్పడ్డారు. ఫలితంగా ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఫలితంగా ఓ తల్లికి కొడుకు దూరమయ్యాడు.. ఓ తండ్రికి పుత్ర శోకాన్ని మిగిల్చాడు. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది..

Written By: Anabothula Bhaskar, Updated On : September 3, 2024 10:10 pm

Crime news

Follow us on

Hyderabad :  హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతంలో ఏఈఎస్ హెచ్ అనే పేరుతో ఓ ఐటీ సంస్థ ఉంది. ఈ సంస్థలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరి ఖని లోని మారుతి నగర్ ప్రాంతానికి చెందిన గజబింకల్ అజయ్ తేజ (24) అనే యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి టీమ్ లీడర్ గా శ్రీకాంత్ అనే వ్యక్తి వ్యవహరిస్తున్నాడు. సోమవారం పుట్టిన రోజు. దీంతో అతడు తోటి ఉద్యోగులకు పార్టీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు. ఇందులో భాగంగా ఘట్ కేసర్ మండలం ఘన పూర్ లోని ఓ విడిది గృహాన్ని బుక్ చేసుకున్నాడు. ఆ విందుకు అజయ్ తేజ తో పాటు 20 మంది ఉద్యోగులు హాజరయ్యారు. వారంతా ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు. ఇందులో 13 మంది మహిళలు కూడా ఉన్నారు. వారంతా అక్కడ మద్యం తాగారు. రాత్రి 12 తర్వాత కేక్ కట్ చేశారు.

స్విమ్మింగ్ పూల్ లో పడేశారు

కేక్ కట్ చేసిన అనంతరం పీకల దాకా మద్యం తాగి ఉన్న ఉద్యోగుల్లో రంజిత్ రెడ్డి, సాయి కుమార్ అజయ్ తేజ ను బలవంతంగా స్విమ్మింగ్ పూల్ లో తీసేసారు. తనకు ఈతరాదని చెప్పినప్పటికీ సాయి తేజను వారు కనికరించలేదు. అతడిని బలవంతంగా స్విమ్మింగ్ పూల్ లో విసిరేశారు. అది లోతుగా ఉండడంతో సాయి తేజ నీటిని మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత వారు స్విమ్మింగ్ పూల్ వద్దకు వచ్చి చూడగా.. అజయ్ తేజ అపస్మారక స్థితిలో కనిపించాడు. దీంతో అతడిని జోడిమెట్ల ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడు అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి మేన మామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రంజీత్ రెడ్డి, సాయికుమార్, విడిది గృహం నిర్వాహకుడు వెంకటేష్ పై అభియోగాలు మోపారు.

విషాద ఛాయలు

కాగా, ఈ ఘటనతో అజయ్ తేజ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చేతికి అందువచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా చనిపోవడాన్ని అతడి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన కొడుకు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వారు సోమవారం సాయంత్రం అజయ్ తేజ మృతదేహాన్ని గోదావరిఖని తీసుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం అజయ్ తేజ అంత్యక్రియలు పూర్తి చేశారు. అజయ్ చనిపోయాడని విషయాన్ని తెలుసుకున్న అతని చిన్ననాటి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉజ్వలమైన భవిష్యత్తు కు దారులు వేసుకుంటున్న సమయంలో అతడు ఇలా చనిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అజయ్ తేజ కుటుంబానికి వారు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.