Karnataka: స్నేహితుడితో కలిసి సరదాగా గడిపేందుకు విహార యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన యువకుడి టూర్ విషాదాంతమైంది. కర్ణాటక వెళ్లిన మిత్రులు.. అక్కడ జలపాతం చూసేందుకు వెళ్లారు. అందులో హైదరాబాద్ యువకుడు పడి మృతిచెందాడు.
ఏం జరిగిందంటే..
హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్(25) ఇటీవల తన స్నేహితుడితో కలిసి చిక్‌మంగళూర్లూ టూర్‌కు వెళ్లాడు. ఇద్దరూ బైక్ అద్దెకు తీసుకుని కొన్ని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. సోమవారం కెమ్మనగుండిలోని హెబ్బె జలపాతం చూసేందుకు వెళ్లారు. కొన్ని రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తుండడంతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది.
సెల్ఫీ కోసం ప్రయత్నించి..
జల పాతం వద్ద మిత్రులు ఇద్దరూ సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. గమనించిన స్థానికులు వీరిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. అయితే, నీటిలో జారిపడినప్పుడు శ్రవణ్ తలకు బండరాయి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈత రాకపోయినా..
మిత్రులిద్దరికీ ఈత రాదు. అయినా ప్రమాదకరంగా సెల్ఫీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో జారి పడ్డారు. శ్రవణ్ ఓ ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో సిస్టమ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఇలా శ్రవణ్ విహారయాత్ర విషాదాంతం అయింది.