cyber fraudsters
Karnataka : వారిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. నెల వేతనం ఇద్దరికీ కలిపి ఐదు లక్షల పై మాట. పైగా వారిద్దరూ ఉంటుంది బెంగళూరులో. వారిది కర్ణాటక రాష్ట్రమే. బెంగళూరులో సొంత ఇల్లు కూడా ఉంది. అయినప్పటికీ తమ తర్వాత తరాల కోసం భారీగా కూడబెట్టాలి అనే ఉద్దేశంతో అధికంగా రాబడి వచ్చే వ్యాపారాల వైపు దృష్టి సారించారు. ఈ క్రమంలో వారికి ఆన్ లైన్ లో ఒక ప్రకటన కనిపించింది. ” మేము బ్రిటన్ నుంచి ఆన్ లైన్ ట్రేడింగ్ రన్ చేస్తున్నాం. అసలుకు రెట్టింపు వస్తుంది. మాకు విశ్వసనీయమైన కస్టమర్లు ఉన్నారు. మా కంపెనీ చరిత్ర ఇది. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు కళ్ల చూస్తారు” అని ఒక ప్రకటన చూశారు. అందులో ఉన్న నంబర్లకు ఫోన్ చేశారు. కొద్దిరోజులు వారితో మాట్లాడిన తర్వాత.. నమ్మకం కుదిరింది. ఆ తర్వాత భార్యాభర్తల అయిన ఐటీ ఉద్యోగులు ఆన్ లైన్ ట్రేడింగ్ మొదలుపెట్టారు. ఇంగ్లాండ్ నుంచి కార్యకలాపాలు సాగించే ఆ కంపెనీ.. మోసపూరితమైన విధానం అమలు చేయడం మొదలుపెట్టింది. ఆ భార్యాభర్తలు పెట్టిన పెట్టుబడులు డబుల్ అయ్యాయని చూపించింది.. దీంతో వారు మరింత ఉత్సాహంతో ఇంకా పెట్టుబడి పెట్టారు. అవి కూడా డబుల్ అయినట్టు చూపించింది.
ఇలా తాము పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుండడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో తమ లాభాలలో కాస్త వెనక్కి తీసుకోవాలని భావించారు. ఎప్పుడైతే వారు ఈ నిర్ణయం తీసుకున్నారో.. అప్పుడే వారికి అసలు కథ తెలవడం మొదలైంది. వారు తమ ఫండ్స్ విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. ఎంతకీ ఆ నగదు వారి ఖాతాలో జమ కాలేదు. ఇందులో భాగంగా ఆ కంపెనీ వారిని సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు. కొద్ది రోజులకు ఆ కంపెనీ వెబ్సైట్ పనిచేయడం ఆగిపోయింది. ఆ తర్వాత ట్రేడింగ్ కూడా నిలిచిపోయింది. అప్పటికే ఆ దంపతులు ఆ కంపెనీలో 1.53 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. వారు జమ చేసిన ఖాతా వివరాలను బెంగళూరులోని ఈస్ట్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీసులకు అందించారు. అదే సమయంలో ఫిర్యాదు కూడా చేశారు. వారు నగదు జమచేసిన ఖాతాల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఆ దంపతులిద్దరి ఖాతాలో ఉన్న బ్యాంకు అధికారులను కూడా సంప్రదించారు. అలా దాదాపు 50 ఖాతాలను స్తంభింపజేశారు..
ఈ 50 ఖాతాలో ఉత్తర భారత దేశంలో పలువురు వ్యక్తుల పేరు మీద నమోదయి ఉన్నాయి. వీటిని ఇంగ్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న సైబర్ క్రైమ్ ముఠా వాడుకుంటున్నది. దీనిని బ్యాంకు పరిభాషలో మ్యూల్ ఖాతాలు అంటారు. అంటే ఈ ఖాతాలను మోసపూరితమైన లావాదేవీల కోసం సైబర్ ముఠా సభ్యులు వాడుకుంటారు. ఇందుకు గానూ ఆ ఖాతా దారులకు నగదు ఇస్తారు. అయితే ఆ ఐటి దంపతులు ముందుగానే అప్రమత్తమై, ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. అలా ఉత్తర భారతదేశం నుంచి ఆపరేట్ చేస్తున్న 50 మ్యూల్ ఖాతాలను స్తంభింపజేశారు. అందులో నుంచి 1.40 కోట్లను హోల్డ్ చేశారు. ఆ తర్వాత ఆ నగదును బ్యాంకు అధికారుల సహకారంతో ఐటీ ఉద్యోగుల ఖాతాల్లోకి మళ్ళించారు.
సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తయమయ్యేలోపే సైబర్ నేరగాళ్లు 13 లక్షలను తమ ఖాతాలకు మళ్ళించుకున్నారు. అయితే వీటిని కూడా వెనక్కి తీసుకొస్తామని బెంగళూరు ఈస్ట్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ” సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఇలాంటి వాటివల్ల నగదు నష్టపోవడంతో పాటు, ఆర్థికంగా తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ఇలాంటి మోసాలకు గురైన వారు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలి. గోల్డెన్ అవర్ లో ఏదైనా చేసేందుకు అవకాశం ఉంటుందని” బెంగళూరు ఈస్ట్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
View Author's Full InfoWeb Title: A software couple in karnataka were duped by cyber fraudsters after investing rs 1 53 crores