Kolkata Doctor Incident: ఆమె ఆర్త నాదాలు ఎవరికీ పట్టలేదా? కోల్ కతా శిక్షణ వైద్యురాలి కేసు దర్యాప్తులో కీలక కోణం..

కోల్ కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో శిక్షణ వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుపుతోంది. ఈ ఘటనలో ఇప్పటికే పలు కీలక విషయాలను వెల్లడించింది. శుక్రవారం మరో కోణం ఈ కేసులో వెలుగులోకి వచ్చింది. ఆ విషయం హత్యాచార బాధితురాలి కన్నీటి వేదన గుండెను బరువెక్కిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 23, 2024 8:06 pm

Kolkata Doctor Incident

Follow us on

Kolkata Doctor Incident: కోల్ కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో శిక్షణ వైద్యురాలి అత్యాచార ఘటన దేశం మొత్తాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ కేసును సిబిఐ విచారిస్తోంది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడిస్తోంది. శుక్రవారం ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది.. శిక్షణ వైద్యురాలు హత్యాచారానికి గురైనప్పుడు సెమినార్ గది తలుపు బోల్ట్ పనిచేయలేదనే విషయం సిబిఐ విచారణలో బయటపడింది. “శిక్షణ వైద్యురాలిని హింసిస్తున్నప్పుడు ఆమె ఆర్త నాదాలు ఎవరికీ వినిపించకపోవడం పట్ల సిబిఐ అధికారులు ఒగింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “భయభ్రాంతులకు గురి చేసే ఆ ఘటన జరిగే సమయంలో లోపలికి ఎవరూ రాకుండా బయట కొంతమంది కాపలా కాసిన కోణంలో విచారణ జరుపుతున్నాం. మా పరిశీలనలో ఆ సెమినార్ గది తలుపు బోల్ట్ విరిగిపోయినట్టు వెల్లడైంది. ఈ విషయాన్ని స్పష్టంగా నిర్ధారించేందుకు సీసీటీవీ పరిశీలించాలని” సిబిఐ అధికారులు పేర్కొన్నారు. సెమినార్ గదిలో లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవరికి వినిపించకపోవడం పట్ల ఆశ్చర్యం కలుగుతోందని సిబిఐ అధికారులు పేర్కొన్నారు.

సెమినార్ గది తలుపు గొల్లెం పని చేయకపోవడాన్ని పలువురు వైద్య సిబ్బంది మా విచారణలో వెల్లడించారని సిబిఐ అధికారులు పేర్కొన్నారు. ” ఆ శిక్షణ వైద్యురాలు ఆగస్టు 9 తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల మధ్య సెమినార్ గదిలోకి ప్రవేశించింది. ఇదే విషయాన్ని ఆరోజు విధుల్లో ఉన్న వైద్యుడు మాతో చెప్పారు. ఇక ఈ కేసు కు సంబంధించి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను మేము ప్రశ్నించామని” సిబిఐ అధికారులు ప్రకటించారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ కి కోల్ కతా ప్రత్యేక న్యాయస్థానం 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసింది. అయితే బాధితురాలు హత్యాచారానికి గురైనప్పుడు రికార్డ్ అయిన సిసి ఫుటేజ్ బయటికి విడుదలైనట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వాటిని కోల్ కతా పోలీసులు, సిబిఐ అధికారులు కొట్టి పారేశారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రసారం చేయకూడదని మీడియాను హెచ్చరించారు. సోషల్ మీడియాకు హితవు పలికారు. కాగా, ఇటీవల హత్యాచారానికి సంబంధించి బాధితురాలి ఫోటోలను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సుప్రీంకోర్టు మండిపడింది. బాధితురాలి కోణంలో ఆలోచించాలని సోషల్ మీడియా ప్లాట్ ఫారాల నిర్వాహకులకు సూచించింది. ఇలాంటి ఘటనల్లో సమయమనం పాటించాలని సూచించింది.