Karnataka Accident: వారంతా బస్సులో ప్రయాణిస్తున్నారు. రాత్రి కావడంతో గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు కూడా వేగంగా దూసుకుపోతోంది. చలికాలం కావడంతో బస్సు కిటికీలు మొత్తం వేశారు. బస్సు డ్రైవర్ తన డోర్ కూడా వేసుకున్నాడు. అందరూ నిద్రలో ఉన్నారు. బస్సు డ్రైవర్ కూడా మంచి వేగంతో నడుపుతున్నాడు. మరి కాసేపట్లో ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకుంటారనగా ఘోరం జరిగింది. ఊహించని పరిణామంతో అక్కడ మొత్తం ఆందోళన నెలకొంది.
ఇటీవల కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదాన్ని మర్చిపోకముందే.. కర్ణాటక రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆ దృశ్యాలు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. బస్సు మొత్తం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు కలవరానికి గురి చేస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా గొర్లతు గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వేగంతో దూసుకెళ్తున్న బస్సులో మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే బస్సును మొత్తం కమ్మేసాయి. ఆ మాటలు లారీని కూడా అంటుకున్నాయి. . దీంతో ఆ రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఆ బస్సులో మొత్తం 32 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుందని తెలుస్తోంది.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు లారీ ఢీకొట్టగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తీవ్రతకు బస్సులో మంటలు ఏర్పడ్డాయి. ఆ మంటలు కాస్త బస్సును పూర్తిగా వ్యాపించాయి. బస్సులో 32 మంది ప్రయాణిస్తున్న క్రమంలో.. 20 మంది సజీవ దహనమయ్యారు. ఆ బస్సు బెంగళూరు నగరం నుంచి శివమొగ్గకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.. ఏసి బస్సు కావడం.. అందులోనూ చలికాలం కావడంతో బస్సు అద్దాలు మొత్తం మూసివేశారు. మంటలు వ్యాపించిన తర్వాత అందరూ బయటకు వెళ్లడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కొంతమంది బస్సు అద్దాలను పగలగొట్టుకొని బయట దూకారు. అలా దూకినవారు క్షతగాత్రులు అయ్యారు. కొంతమంది నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు..
ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదాన్ని మర్చిపోకముందే.. ఈ దారుణం చోటు చేసుకోవడం విశేషం. 20 మంది సజీవ దహనం కావడంతో ఆ ప్రాంతం మొత్తం హాహా కారాలతో భీతావహ వాతావరణం నెలకొంది. కర్ణాటక అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా సహాయ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.